మౌన దీక్షభగ్నం.. వైఎస్‌ షర్మిల అరెస్ట్.. కవితకు తప్ప ఎవరికీ రక్షణ లేదన్న వైఎస్సార్‌టీపీ అధినేత్రి

8 Mar, 2023 13:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. సర్కార్‌కు వ్యతిరేకంగా, తెలంగాణ మహిళలకు సంఘీభావంగా దీక్షకు దిగిన వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా..  ట్యాంక్‌ బండ్‌పై  బుధవారం ఆమె మౌన దీక్ష చేపట్టారు. అయితే.. దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేసి బొల్లారం పోలీస్‌ స్టేషన్‌కి తరలించారు. 

అంతకు ముందు..  రాణి రుద్రమ దేవి విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులు అర్పించి దీక్షకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా.. ఆమె కల్వకుంట్ల కుటుంబంపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. 

ఆమె ఏమన్నారంటే..  ‘‘తెలంగాణ రాష్ట్రం అత్యాచారాల్లో నెంబర్ వన్‌. మహిళలను ఎత్తుకుపోవడంలో నెంబర్‌ వన్‌. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు. మహిళలకు భద్రత కల్పిస్తున్నాం అని కేసీఆర్ సర్కార్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. యేటా 20 వేల అత్యాచారాలు జరుగుతున్నాయి. కేసీఆర్కి మహిళల భద్రత పట్ల చిత్త శుద్ది లేదు.  కేసీఆర్‌ దృష్టిలో మహిళలు ఓట్లు వేసే యంత్రాలు. మహిళ భద్రతకు చిన్న దొర కేటీఆర్ భరోసా యాప్ అని చెప్పాడు. ఎక్కడుంది భరోసా యాప్?. నేను ఫోన్ లో చెక్ చేశా.. ఎక్కడ కనపడలేదు యాప్. కేవలం మాటలకి మాత్రమే చిన్న దొర,పెద్ద దొర. తెలంగాణ రాష్ట్రం మహిళలకు ఒక ల్యాండ్ మైన్ లా తయారయ్యింది. మహిళల పట్ల ఎక్కడ ఏ బాంబ్ పేలుతుంది తెలియదు. 

.. రాష్ట్రంలో అధికార పార్టీ నేతలే అత్యాచారాలకు పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారామె.  రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లలో వేల కేసులు నమోదు అయ్యాయి. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎంతో మంది అత్యాచారాలకు పాల్పడ్డారు. చిన్న దొర కేటీఆర్ నియోజక వర్గంలో కూడా మైనర్‌లపై అత్యాచారం జరిగితే దిక్కు లేదు. హైదరాబాద్ నడిబొడ్డున పట్టపగలు అత్యాచారం జరిగితే దిక్కు లేదు. ‘ఆడపిల్లల పై కన్నెత్తి చూస్తే గుడ్లు పీకుతా’.. అని చెప్పిన కేసీఅర్ ఎంత మంది గుడ్లు పీకారు. స్వయంగా మంత్రుల బంధువులు రేపులు చేసినా దిక్కు లేదు. 

కేసీఆర్కి ఆడవాళ్లు అంటే వివక్ష. కేసీఆర్కి ఆడవాళ్లు అంటే కక్ష. దళిత మహిళలపై దాడులు చేస్తున్నారు. లాకప్ డెత్ లు చేస్తున్నారు. తెలంగాణలో ఓకే ఒక్క మహిళకు రక్షణ ఉంది. ఆమె కల్వకుంట్ల కవిత. మిగతా మహిళలంటే కేసీఆర్కి లెక్కే లేదు. ఏకంగా రాష్ట్ర ప్రథమ పౌరురాలైన గవర్నర్ మీదనే అసభ్య పదజాలం వాడుతున్నారు. గవర్నర్‌కే గౌరవం ఇవ్వడం లేదు. రాష్ట్రంలో మహిళా కమీషన్ ఒక డమ్మీ. స్వయంగా నేనే ఫిర్యాదు చేసినా దిక్కు లేదు.  సర్కార్ నిర్లక్ష్యాన్ని ఎండగడితే నోటి కొచ్చినట్లు తిట్టారు నన్ను.  ఇదేనా రాష్ట్రంలో మహిళకు ఉన్న గౌరవం. గవర్నర్‌, సాధారణ మహిళలకు, మహిళా నేతలకే కాదు..  ఐఏఎస్ మహిళా అధికారులకు గౌరవం లేదు. మహిళా ఉపాధ్యాయులకు గౌరవం లేదు. 

పోడు భూములకు పట్టాలు అడిగితే చంటి బిడ్డల తల్లులను జైల్లో పెట్టారు. ఇది దిక్కుమాలిన పాలన. కేసీఆర్ బిడ్డకు తప్పితే ఎవరు సంతోషంగా లేరు. కేసీఆర్ బిడ్డ కవితకు ఏ లోటూ లేదు. ఓడిపోతే కవితకు ఎమ్మెల్సీ కట్టబెట్టి.. అదే మహిళలకు దక్కిన గౌరవం అని ప్రచారం చేసుకున్నారు.  కవిత సిగ్గులేకుండా లిక్కర్ వ్యాపారం చేశారు. స్కాంలో చిక్కి.. మహిళల గౌరవాన్ని దెబ్బ తీశారు. రాష్ట్రంలో దిక్కు లేదు కానీ కవిత దేశంలో ధర్నా చేస్తారట!. అసలు రాష్ట్రంలో 33 శాతం ఎక్కడ అమలు అవుతుంది. ఇక్కడ నాలుగు శాతం కూడా అమలు కాలేదు. రెండు పర్యాయాలు కలిపి 10 సీట్లు కూడా మహిళలకు ఇవ్వలేదు. మహిళా మంత్రులకు దిక్కు లేదు. ఉన్న ఇద్దరు మంత్రులను డమ్మీలను చేశారు. అసలు మహిళల అభ్యున్నతికి ఒక్క పథకం లేదు. కేసీఆర్‌ది నియంత పాలన.. మహిళల పట్ల సర్కార్‌ నిర్లక్ష్యానికి నిరసనగా మౌన దీక్షఅని ప్రకటించారామె.

మరిన్ని వార్తలు