సిరులు కురిపిస్తున్న సింగరేణి 

17 Apr, 2022 05:03 IST|Sakshi
మంచిర్యాల జిల్లాలో థర్మల్‌ ప్లాంట్‌ పరిసర గ్రామాలకు సింగరేణి నిధులతో నిర్మించిన రోడ్డు

ఏటా వందల కోట్ల అదాయాన్నిస్తున్న సంస్థ 

కేంద్ర, రాష్ట్ర ఖజానా నింపడంలో కీలక పాత్ర

గడిచిన ఎనిమిదేళ్లలో రూ.40 వేల కోట్ల చెల్లింపులు

సాక్షి, మంచిర్యాల: సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్‌సీసీఎల్‌) తవ్వేది బొగ్గు గనులే అయినా.. ఇది రాష్ట్రం పాలిట బంగారు గని. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించడమే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏటా వందల కోట్ల రూపాయలు అందిస్తోంది. బొగ్గు ఉత్పత్తి, అమ్మకాలు పెరిగే కొద్దీ సంస్థ టర్నోవర్‌ పెరుగుతోంది. దీంతో సర్కారుకు రాయల్టీ, జీఎస్టీ, డివిడెంట్లు, కస్టమ్స్‌ డ్యూటీ, స్వచ్ఛభారత్, కృషి కల్యాణ్, క్లీన్‌ ఎనర్జీ సెస్‌లు తదితర రూపాల్లో సింగరేణి చెల్లింపులు చేస్తోంది.  

ఎనిమిదేళ్లలో రూ.40వేల కోట్ల ఆదాయం..  
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత గడిచిన ఎనిమిదేళ్లలో సింగరేణి సంస్థ గణనీయంగా అభివృద్ధి సాధించింది. ఈ ఎనిమిదేళ్లలో సుమారు రూ.40 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని కేంద్ర, రాష్ట్రాలకు అందించింది. ఇందులో రాష్ట్రానికి రూ.17 వేల కోట్లకుపైనే రాగా, కేంద్రానికి రూ.22 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. గతేడాది నుంచి ఒడిశాలోని నైనీ బ్లాక్‌లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కావడంతో అక్కడ కూడా పన్నులు చెల్లిస్తోంది. దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న సింగరేణి సంస్థ, కోల్‌ ఇండియాతో పోటీ పడుతోంది. 

2014కు ముందు ఏటా 504 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయగా, ప్రస్తుతం 680 లక్షల టన్నులకు చేరింది. నికర లాభం రూ.419 కోట్ల నుంచి రూ.1,500 కోట్లకు చేరింది. 2029–30 నాటికి వంద మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా ఉంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ముందు ముందు మరింత ఆదాయం రానుంది.  

ఆరు జిల్లాల్లో నిధుల వరద.. 
కుమ్రంభీం, మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల అభివృద్ధిలో సింగరేణి భాగం పంచుకుంటోంది. కరోనా సమయంలో ప్రభుత్వ నిధులు నిలిచిపోయినప్పటికీ ఈ జిల్లాల్లో మాత్రం సింగరేణి నిధులతో అభివృద్ధి కొనసాగింది. గతేడాది డిసెంబర్‌ నాటికి వివిధ రూపాల్లో ఈ ఆరు జిల్లాలకు సింగరేణి రూ.3,248 కోట్లు సమకూర్చింది. సింగరేణి గనులు విస్తరించిన ప్రాంతాల్లో విద్య, వైద్యం, రహదారులు, ఇతర మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తోంది.  

ఆపత్కాలంలో ఆదుకుంటూ.. 
కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణి నిధులు అందించి అండగా నిలిచింది. ఒడిశాలోనూ ఉత్పత్తి చేస్తున్నందున ఫెని తుఫాన్‌ వచ్చినప్పుడు రూ.కోటి సాయం చేసింది. వీటికి తోడు కోల్‌బెల్ట్‌ పరిధిలోని ప్రజాప్రతినిధుల సిఫారసు మేరకు కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.  

మరిన్ని వార్తలు