మన సోయాకు ‘మహా’ డిమాండ్‌

18 Nov, 2020 08:33 IST|Sakshi

మహారాష్ట్రలో ఎంఎస్‌పీ కంటే ఎక్కువ ధర

ప్రైవేటు వ్యాపారులకే విక్రయం 

సర్కారు కేంద్రాల వైపు చూడని రైతులు

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: సోయా పంటకు మహారాష్ట్రలో మంచి డిమాండ్‌ ఏర్పడింది. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కంటే ఎక్కువ ధర పలుకుతుండటంతో రైతులు తమ సోయా పంటను అక్కడి వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఇప్పటికే సుమారు 90 శాతానికి మించి పంట మహారాష్ట్రకు తరలిపోయింది. నాందేడ్, లాతూరు, కుసునూరు తదితర ప్రాంతాల్లో సోయా ఆయిల్‌ మిల్లులు, సోయా ఆధారిత పరిశ్రమలు ఉన్నాయి. పెద్ద రైతులు లారీల్లో అక్కడికి తీసుకెళ్లి విక్రయించగా, చిన్న సన్నకారు రైతులు కూడా స్థానికంగా ఉండే వ్యాపారులకు విక్రయించగా, వారు ఈ సోయాను మహారాష్ట్రలోని ఆయిల్‌ మిల్లులకు తరలించారు. 

ఎంఎస్‌పీ కంటే ఎక్కువ ధర 
బహిరంగ మార్కెట్‌లో సోయాకు మంచి ధర పలకడంతో రైతులు తమ పంటను ప్రైవేటు వ్యాపారులకే విక్రయించారు. సోయాకు కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.3,880 ఉంది. అయితే వ్యాపారులు క్వింటాలుకు రూ.3,900 నుంచి రూ.4,200 వరకు ఇస్తుండటంతో రైతులు ప్రైవేటు వైపే మొగ్గు చూపారు. సర్కారు కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే డబ్బులు రావడానికి కాస్త సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. దీనికి తోడు కాంటాలు చేయడంలో జాప్యం జరుగుతోంది. ప్రైవేటు వ్యాపారులు వెంటనే నగదు చెల్లించడంతో పాటు, గ్రామానికి వచ్చి కాంటాలు చేస్తుండటంతో రైతులు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించడం లేదు. 

నాఫెడ్‌ కొనుగోళ్లు నిల్‌ 
ఈసారి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నాఫెడ్‌ సోయాను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ మార్క్‌ఫెడ్‌కు కొనుగోళ్ల బాధ్యతలు అప్పగించింది. అయితే మార్క్‌ఫెడ్‌ జిల్లాల వారీగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నిజామాబాద్‌ జిల్లాలో పలుచోట్ల కేంద్రాలను ప్రారంభించినప్పటికీ.. ఈ కేంద్రాలకు సరుకు రాలేదు. రైతులంతా ప్రైవేటు వ్యాపారులకే విక్రయించారు. ఒక్క నిజామాబాద్‌ జిల్లాలోనే సుమారు ఆరు లక్షల క్వింటాళ్ల సోయాను ప్రైవేటు వ్యాపారులే కొనుగోలు చేశారు.

మరిన్ని వార్తలు