75 వారాలు 75 ప్రాంతాల్లో 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలు

9 Mar, 2021 02:18 IST|Sakshi

ఘనంగా 75 ఏళ్ల పండుగ!

రాష్ట్రంలో ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ 

మార్చి 12 నుంచి ఆగస్టు 15 వరకు నిర్వహణ

కేవీ రమణాచారి నేతృత్వంలో నిర్వహణ కమిటీ

మార్చి 12న వరంగల్‌లో ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా గవర్నర్‌

అదేరోజు హైదరాబాద్‌లో ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి

ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి కాబోతున్న నేపథ్యంలో, కేంద్రం తలపెట్టిన ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ను రాష్ట్రంలో ఘనంగా నిర్వహించాలని ప్రధాని నరేంద్రమోదీతో సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఉత్సవ కమిటీ సభ్యులు, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, శాస్త్రవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఉత్సవాల సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులు, అమరవీరులను స్మరించుకుని నివాళులు అర్పించాలని పేర్కొన్నారు. దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో తెలంగాణ ప్రాంతం పోషించిన పాత్ర ప్రత్యేకమైందని చెప్పారు.

దేశ పురోగమనంలో తెలంగాణది ఉజ్వలమైన భాగస్వామ్యమని పేర్కొన్నారు. 2021 మార్చి 12 నుంచి ఆగస్టు 15 వరకు 75 వారాల పాటు నిర్వహించనున్న ఈ మహోత్సవాలకు రూ.25 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సభ్యులుగా సాధారణ పరిపాలన, ఆర్థిక, సాంస్కృతిక వ్యవహారాలు, మున్సిపల్, పంచాయతీరాజ్, విద్యా శాఖల కార్యదర్శులు, పురపాలక శాఖ డైరెక్టర్, పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్లు, సభ్యకార్యదర్శిగా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ ఉంటారని తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు.

75 ప్రాంతాల్లో ఎత్తయిన జాతీయ జెండాలు 
75వ స్వాతంత్య్ర దినోత్సవాలకు గుర్తుగా, సంజీవయ్య పార్క్‌లో ఉన్న జాతీయ పతాకం తరహాలో, రాష్ట్రవ్యాప్తంగా 75 ముఖ్యమైన ప్రాంతాల్లో ఘనమైన రీతిలో జాతీయ జెండాలను ఎగురవేసి జాతీయ భావాలను పెంపొందించాలని పేర్కొన్నారు. 75 వారాల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా వివిధ స్థాయిల్లో వ్యాస రచన పోటీలు, కవి సమ్మేళనాలు, ఉపన్యాస పోటీలు, చిత్రలేఖన పోటీలు వంటి దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. సమీక్షలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సాంస్కృతిక శాఖ, కార్యదర్శి శ్రీనివాస్‌రాజు, డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.

ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌
ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల నేపథ్యంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌ నుంచి పాల్గొన్నారు. ఉత్సవాల ప్రాధాన్యత, విధివిధానాలు, లక్ష్యాలను ప్రధాని వివరించారు. రాష్ట్రాలు 75 వారాల పాటు దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం.. ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సీఎం కేసీఆర్‌ అధికారులతో సమీక్షించారు. మార్చి 12న హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌లో, వరంగల్‌ పోలీసు గ్రౌండ్స్‌లో ఉత్సవ ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్, వరంగల్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పాల్గొంటారు. కార్యక్రమంలో భాగంగా ఉదయం 11 గంటలకు జాతీయ జెండావిష్కరణ, పోలీసు కవాతు తదితర దేశభక్తి కార్యక్రమాలు ఉంటాయని సీఎం తెలిపారు. కోవిడ్‌–19 నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు.

మరిన్ని వార్తలు