తప్పని పడిగాపులు 

11 Oct, 2022 02:19 IST|Sakshi

గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్న ప్రత్యేక రైళ్లు 

సాధారణ సర్వీసుల కంటే 30 శాతం చార్జీలు అదనం 

సకాలంలో గమ్యం చేరని వైనం 

రద్దీ రూట్లలో ప్రత్యేక రైళ్లకు డిమాండ్‌ 

సాక్షి, హైదరాబాద్‌:  దసరా సందర్భంగా సొంత ఊరుకు వెళ్లిన సురేష్‌ కుటుంబం ఆదివారం  శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి హైదరాబాద్‌కు తిరుగు పయనమైంది. అన్ని రెగ్యులర్‌ రైళ్లలో  వెయిటింగ్‌ లిస్టు భారీగా ఉండడంతో ఒడిశాలోని బర్హంపూర్‌ నుంచి సికింద్రాబాద్‌ మీదుగా  నాందేడ్‌కు వెళ్లే ప్రత్యేక రైలు (07432)లో బయలుదేరారు. ఆదివారం సాయంత్రం 6.27కు పలాస నుంచి బయలుదేరాల్సిన ఈ రైలు మూడు గంటలు ఆలస్యంగా రాత్రి 9.30 గంటలకు బయలుదేరింది.

సోమవారం ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోవాల్సిన ఉండగా ఏకంగా మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకోవడం గమనార్హం. “రైలు  బయలుదేరడానికి ముందు మూడు గంటలు ఎదురు చూస్తే గమ్యం చేరుకోవడానికి మరో నాలుగున్నర గంటల పాటు రైల్లోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది’ అని సురేష్‌ ఆందోళన  వ్యక్తం చేశారు. రాత్రి  9 గంటల నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు  రైలులోనే గడపాల్సి రావడంతో పిల్లలు  తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు ఆయన చెప్పారు. ఇలా ఒక్క సురేష్‌ కుటుంబం మాత్రమే కాదు. ప్రత్యేక రైళ్లలో రాకపోకలు సాగించే వందలాది మంది  ప్రయాణికులు సకాలంలో గమ్యం చేరుకోలేక  గంటల తరబడి పడిగాపులు కాయాల్సివస్తోంది.  

అదనంగా చెల్లించినా..  
రెగ్యులర్‌ రైళ్లతో పోలిస్తే ప్రత్యేక రైళ్లలో చార్జీలు సైతం ఎక్కువే,  రెగ్యులర్‌ రైళ్లలో ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని వివిధ మార్గా ల్లో వెయిటింగ్‌ లిస్టుకు అనుగుణంగా  ప్రత్యేక రైళ్లను  ఏర్పాటు చేస్తారు. వీటిలో సుమారు 30  శాతం వరకు చార్జీలు అదనంగా ఉంటాయి. దసరా, దీపావళి  వంటి పండగలు, వరుస సెలవులు, ప్రత్యేక పర్వదినాల్లో  ప్రత్యేక రైళ్లు సైతం కిక్కిరిసిపోతాయి.

ఈసారి దసరా సందర్భంగా హైదరాబాద్‌  నుంచి వివిధ మార్గాల్లో  సుమారు 50కి పైగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. మరికొన్నింటిలో అదనపు బోగీలను, బెర్తులను ఏర్పాటు చేశారు. రైళ్ల నిర్వహణ మాత్రం దారుణంగా ఉంది. ఈ రైళ్లన్నీ 2 నుంచి 4 గంటల వరకు, కొన్ని రైళ్లు ఏకంగా 6 గంటలకు పైగా ఆలస్యంగా నడుస్తున్నాయి.  

మరిన్ని వార్తలు