బడుల బాగుకు రూ.7 వేల కోట్లు

4 Feb, 2022 04:26 IST|Sakshi

‘మన ఊరు–మన బడి’, ‘మన బస్తీ–మన బడి’ల కింద ఖర్చు తొలిదశలో 9,123 పాఠశాలల్లో.. 

12 రకాల మౌలిక వసతుల కల్పన 

పాలనపరమైన అనుమతులిస్తూ జీవో 

ఎస్‌ఎస్‌ఏ, ఉపాధి హామీ, స్థానిక సంస్థల ద్వారా నిధులు 

పాఠశాల యాజమాన్య కమిటీల ఆధ్వర్యంలో పనులు

సాక్షి, హైదరాబాద్‌: బడుల్లో మౌలిక వసతులను పెంచేందుకు చేపట్టిన ‘మన ఊరు–మన బడి’, ‘మన బస్తీ–మన బడి’కార్యక్రమాలకు తొలిదశలో రూ.7,289.54 కోట్ల వ్యయానికి ప్రభుత్వం పాలనాపరమైన అనుమతినిచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మూడు దశల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, స్థానిక సంస్థల పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం, మరమ్మతులు, అవసరమైన ఫర్నిచర్‌ ఏర్పాటు, డిజిటల్‌ క్లాస్‌రూమ్‌లు, టాయిలెట్ల ఏర్పాటు వంటివాటిని ఈ నిధులతో సమకూర్చనున్నారు. మౌలిక వసతుల కల్పన ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికను పెంచడం, నాణ్యమైన విద్యను అందించడాన్ని ల క్ష్యంగా పెట్టుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ‘మన ఊరు–మనబడి’, పట్టణ ప్రాంతాల్లో ‘మన బస్తీ–మన బడి’పేరుతో ఈ పథకం అమలవుతుంది. 

రాష్ట్రవ్యాప్తంగా మూడు దశల్లో.. 
►   వచ్చే మూడేళ్లలో అన్ని స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తొ లిదశ కింద అత్యధికంగా విద్యార్థులుండే 9,123 (35 శాతం) స్కూళ్లలో రూ.3,497.62 కోట్లతో పనులు చేస్తారు. ఒక కేంద్రంలో రెండు పాఠశాలలున్నా పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేస్తారు. పథకం నిర్వహణను (టెండర్లు, ఇతర నిధుల ఖర్చు) మొత్తం ఆన్‌లైన్‌ ద్వారానే చేపడతారు. ఎక్కువ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసే ఉపకరణాలను రాష్ట్రస్థాయిలో ఎంపిక చేస్తారు. 
►   నీటి వసతితో టాయిలెట్ల ఏర్పాటు, విద్యుదీకరణ, తాగునీటి సౌకర్యం, విద్యార్థులు, ఉపాధ్యాయులకు అవసరమైన ఫర్నిచర్, స్కూల్‌ మొత్తానికి రంగులు వేయడం, అన్నిరకాల మరమ్మతులు చేయడం, గ్రీన్‌ చాక్‌బోర్డ్‌ల ఏర్పాటు, కాంపౌండ్‌ వాల్స్, కిచెన్‌ షెడ్ల నిర్మాణం, ఆధునిక హంగులతో కొత్త క్లాసు రూముల నిర్మాణం, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్‌ హాల్స్, డిజిటల్‌ విద్యకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తారు. 
►    ఈ పథకం కింద పనులను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తారు. వారే పాలనా పరమైన అనుమతులిస్తారు. అవసరమైన ఏజెన్సీలను ఎంపిక చేస్తారు. సాంకేతికపరమైన అనుమతులను సంబంధిత ఇంజనీర్లు పర్యవేక్షిస్తారు. పనులన్నీ స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీల భాగస్వామ్యంతో చేపడతారు. పథకానికి అవసరమైన నిధులను సమగ్ర శిక్షా అభియాన్, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్, ఏసీడీపీ, జెడ్‌పీపీ, ఎంపీపీ తదితర సంస్థల ద్వారా సమకూరుస్తారు. 
►   పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ)లు ఒకవేళ పనులు చేయడానికి ఆసక్తి చూపని పక్షంలో కలెక్టర్‌ ఆధ్వర్యంలోనే చేపడతారు. పనులు పూర్తయినట్లుగా ఎంబీ రికార్డు అయ్యాకే ఆన్‌లైన్‌లో నిధులు చెల్లిస్తారు. ఎస్‌ఎంసీలకు నిధుల విడుదలకు సంబంధించి.. ఎస్‌ఎంసీ చైర్మన్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, అసిస్టెంట్‌ ఇంజనీర్, సర్పంచ్‌ నలుగురూ సంతకాలు చేయాల్సి ఉంటుంది. 
►   పాఠశాలలకు రూ.రెండు లక్షలు దానం చేసే దాతలను కూడా కమిటీలో భాగస్వాములను చేస్తారు. పదిలక్షలు ఇస్తే.. వారు కోరిన పేరును ఒక క్లాస్‌రూమ్‌కు పెడతారు. 
►    ప్రతి పాఠశాలలో పూర్వ విద్యార్థులతో కమిటీలు ఏర్పాటు చేస్తారు. అందులో చురుకుగా ఉండే ఇద్దరిని, ఎస్‌ఎంసీలోని ఇద్దరు, సర్పంచ్, ప్రధానోపాధ్యాయుడితో పాఠశాలల అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేస్తారు. 

పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు..: సబితా ఇంద్రారెడ్డి
ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి, సరికొత్త ఒరవడితో ముందుకు తీసుకెళ్లేందుకు మన ఊరు–మన బడి కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గురువారం ఈ కార్యక్రమంపై విద్యా శాఖ అధికారులతో సన్నాహక సమావేశం నిర్వ  హించారు. ఈ సందర్భంగా ‘మన ఊరు–మన బడి’కార్యక్రమానికి అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని టీసీఎస్‌ సంస్థకు మంత్రి సూ చించారు. పాఠశాలల సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మన ఊరు–మనబడి కార్యక్రమం కింద రూ.7,289 కోట్లు వెచ్చించి.. 12 రకాల కనీస సౌకర్యాలను కల్పించనున్నట్టు తెలిపారు. అందులో తొలిదశ కింద 9,123 పాఠశాలల్లో రూ.3,497 కోట్లు ఖర్చు చేయబోతున్నట్టు చెప్పారు.  

మరిన్ని వార్తలు