తెలంగాణ: పదో తరగతి ఫలితాలు విడుదల

21 May, 2021 11:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పదో తరగతి పరీక్షల ఫలితాలను తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. హైదరాబాద్‌లో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులతో కలిసి ఫలితాలను విడుదల చేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు వెబ్‌సైట్‌లో ఫలితాలు అందుబాటులో ఉండనున్నాయి. కరోనా కారణంగా ఈసారి పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని 5.21 లక్షల మంది పదో తరగతి విద్యార్థులందరినీ ఉత్తీర్ణులను చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఫలితాల కోసం bsetelangana.org ను సంప్రదించండి.

ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్ లను నిర్ణయించినట్లు మంత్రి సబిత తెలిపారు. పదో తరగతి పరీక్షల కోసం నమోదు చేసుకొన్న 5,21,073 మంది విద్యార్థులను ఉత్తీర్ణులను చేసినట్లు వెల్లడించారు. వీరిలో 5,16,578 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా 4,495 మంది గతంలో ఫెయిలై ప్రస్తుతం పరీక్ష ఫీజు చెల్లించినవారని వివరించారు.

ఉత్తీర్ణత సాధించిన వారు

బాలురు 2,62,917
బాలికలు 2,53,661
10/10 జీపీఏ సాధించిన విద్యార్థులు 2,10,647
10/10 జీపీఏ సాధించిన పాఠశాలలు 535

పాస్ మెమోలను సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా తీసుకోవచ్చని మంత్రి సూచించారు.  విద్యార్థుల పాస్ మెమోల్లో ఏవైనా పొరపాట్లు తలెత్తితే సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా ఎస్సెస్సీ బోర్డుకు పంపాలని సూచించారు. పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు భవిష్యత్‌లో మంచి కోర్సులను ఎంపిక చేసుకొని  తమ భవిష్యత్ను‌ బంగారుమయం చేసుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.

విద్యార్థులకు ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఏ–1)లో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకోనుంది. ఆయా సబ్జెక్టులకు ఎఫ్‌ఏ–1లో నిర్దేశిత 20 శాతం మార్కుల ప్రకారం ప్రతి విద్యార్థి వాటిల్లో సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడింగ్‌ ఇచ్చింది. ఎఫ్‌ఏ–1 పరీక్షలకు 5.21 లక్షలమంది విద్యార్థులు హాజరైనట్లు గుర్తించిన విద్యాశాఖ వారికి ఆ పరీక్షల్లో వచ్చిన మార్కులను ఐదింతలు చేసి (20 శాతాన్ని 100 శాతానికి పెంచి) గ్రేడ్లు ఇచ్చేలా చర్యలు చేపట్టింది. విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టులో వచ్చిన మార్కుల ప్రకారం గ్రేడింగ్, గ్రేడ్‌ పాయింట్లు ఇచ్చి, అన్ని సబ్జెక్టులకు కలిపి గ్రేడ్‌ పాయింట్‌ యావరేజ్‌(జీపీఏ)ను ప్రకటించింది. 2.2 లక్షల మంది విద్యార్థులకు 10/10 జీపీఏ వచ్చినట్లు తెలిసింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు