‘పది’ గట్టెక్కేదెలా?.. సిలబస్‌ పూర్తి కాని వైనం..

1 Jan, 2023 10:25 IST|Sakshi

ప్రత్యేక తరగతులు, వారాంతపు పరీక్షలకు ఆదేశాలు 

సర్కారు బడుల్లో ఎస్సీఈఆర్టీ ప్రణాళిక అమలయ్యేనా..

సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులను గటెక్కించడం విద్యాశాఖకు సాధ్యమయ్యే  పరిస్థితి కనిపించడం లేదు. మహానగరంలోని  సర్కారు బడుల్లో  సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత, మరోవైపు  సిలబస్‌ పూర్తి కాక పోవడం వంటివి తలకు మించిన భారంగా మారాయి. తాజాగా  సర్కారు బడుల్లో  మంచి ఫలితాల సాధన కోసం  నిర్వహించ తలపెట్టిన  ప్రత్యేక తరగతులు, వారాంతపు పరీక్షల అమలు ప్రశ్నార్థకంగా మారాయి.

కరోనా నేపథ్యంలో విద్యార్థులో అభ్యసన సామర్థ్యాలు తగ్గడంతో పాటు సబ్జెక్టులపై  కనీస  పట్టులేకుండా పోయింది. వాస్తవంగా సబ్జెక్టు  నిపుణుల  కొరతతో ప్రధాన  సబ్జె క్టుల్లో పాఠ్యాంశాల బోధన  అంతంత మాత్రంగా తయారైంది. ఆయా పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులతోనే ప్రధానోపాధ్యాయులు బోధన కొనసాగిస్తున్నారు. కరోనా,  ఆరి్థక పరిస్థితుల నేపథ్యంలో  ఈ విద్యా సంవత్సరం పదో తరగతిలో  కొత్త అడ్మిషన్లు బాగానే  పెరిగాయి. అయితే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

సమస్యను విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోయిందని సాక్షాత్తు ప్రధానోపాధ్యాయులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే సర్కారు  బడుల్లో వంద శాతం ఫలితాలు సాధించడానికి అధికారులు మాత్రం ఏటా మొక్కుబడిగా ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నా అందుకు అనుగుణంగా టీచర్ల ఖాళీల భర్తీ ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో విఫలం కావడంతో మరింత వెనుకబాటు తప్పడం లేదు.  

సరికొత్త ప్రణాళిక 
సర్కారు బడుల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితులను అధిగమించకుండా  పదవ తరగతి పరీక్షలో మంచి ఫలితాల కోసం  రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆరీ్ట) తొలిసారిగా 
సరికొత్త ప్రణాళిక  రూపొందించింది.  వాస్తవంగా పదవ తరగతి పరీక్షల నేప«థ్యంలో జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారులు ప్రత్యేక తరగతులు, పరీక్షలపై ప్రణాళిక రూపొందించి అమలు చేసేవారు. ఆయితే సర్కారు బడుల్లో తగ్గుతున్న పదవ తరగతి ఫలితాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళిక  రూపొందించడం విశేషం. 
40రోజులు ప్రత్యేక తరగతులు.. 
పదవ తరగతి విద్యార్థులు సబ్జెక్టులపై  మరింత పట్టు సాధించేందుకు 40 రోజుల పాటు  ప్రత్యేక తరగతులు  నిర్వహించనున్నారు. జనవరి 3 నుంచి మార్చి 10వ వరకు   ప్రత్యేక తరగతులు కొనసాగుతాయి. పాఠశాల ప్రారంభ సమయం కంటే ముందు ఉదయం 8.30నుంచి  9.30 గంటల వరకు ఒక సబ్జెక్టు,  పాఠశాల సమయం అనంతరం 
సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు మరో సబ్జెక్టులో  తరగతులు నిర్వహిస్తారు. రోజుకు రెండు సబ్జెక్టులు బోధిస్తారు. వాటిపైనే వారం వారం పరీక్షలు నిర్వహిస్తారు. 
3 నుంచి వారాంతపు పరీక్షలు 
పదో తరగతి వార్షిక పరీక్షలకు సన్నద్ధమయ్యేవిధంగా ప్రతి ఆదివారం, రెండో శనివారాల్లో  వారాంతపు పరీక్షలు జరుగుతాయి.  ప్రతి వారం ఒకే రోజు  రెండు పరీక్షలు 
ఉదయం 9 నుంచి11 గంటల వరకు ఒక పరీక్ష,  11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రెండో పరీక్ష నిర్వహించాల్సి ఉంది..
చదవండి: ఐటీ కారిడార్‌కు మరో మణిహారం.. కొత్త సంవత్సరం కానుకగా ఫ్లై ఓవర్‌..

మరిన్ని వార్తలు