పంచాయతీల ఆన్‌లైన్‌ ఆడిట్‌లో తెలంగాణ నం.1.. రెండో స్థానంలో ఏపీ

6 Dec, 2021 03:23 IST|Sakshi

12,769 గ్రామ పంచాయతీల్లో నూరు శాతం ప్రక్రియ పూర్తి

6,549 పంచాయతీల్లో ఆడిటింగ్‌తో రెండో స్థానంలో ఉన్న ఏపీ

సాక్షి, హైదరాబాద్‌: గ్రామ పంచాయతీల్లో నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడంతోపాటు పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన పంచాయతీల ఆన్‌లైన్‌ ఆడిటింగ్‌ విధానంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని మొత్తం 12,769 గ్రామ పంచాయతీల్లోనూ ప్రభుత్వం ఆన్‌లైన్‌ ఆడిటింగ్‌ను 100 శాతం పూర్తి చేసింది. అలాగే ఆయా నివేదికలను ఆన్‌లైన్‌లో కేంద్రానికి సమర్పించింది. తద్వారా ఈ ఘనత సాధించిన ఏకైక రాష్ట్రంగా నిలిచింది.

దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లోని గ్రామ పంచాయతీల్లో ఈ ప్రక్రియ ఇప్పటివరకు 13 శాతమే పూర్తవగా మరో 16 రాష్ట్రాల్లో ఇది ఇంకా మొదలుకాలేదు. దేశంలోని 2,56,561 గ్రామ పంచాయతీలకుగాను ఇప్పటివరకు 32,820 పంచాయతీల్లోనే ఆన్‌లైన్‌ ఆడిటింగ్‌ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 6,549 గ్రామ పంచాయతీల్లో ఆన్‌లైన్‌ ఆడిట్‌ను పూర్తి చేసి రెండో స్థానంలో నిలవగా 5,560 పంచాయతీల్లో ఆడిటింగ్‌తో తమిళనాడు మూడో స్థానం నిలిచింది. మరోవైపు మండలాలవారీ ఆడిటింగ్‌లోనూ రాష్ట్రం తొలిస్థానంలో నిలిచింది. తెలంగాణలోని 540 మండలాలకుగాను ఇప్పటివరకు 156 చోట్ల ఆడిట్‌ పూర్తిచేసింది.

కేంద్రం గ్రామ పంచాయతీల ఆన్‌లైన్‌ ఆడిటింగ్‌కు ఆదేశించిన వెంటనే ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పర్యవేక్షణలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకష్ణారావు సూచనలతో ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలంగాణ ఆడిట్‌ శాఖ డైరెక్టర్‌ మార్తినేని వేంకటేశ్వరరావు తెలిపారు. తెలంగాణ ఆడిట్‌ శాఖ ఇప్పటికే ఆన్‌లైన్‌ ఆడిటింగ్‌లో 2,10,781 అభ్యంతరాలను నమోదు చేసిందన్నారు. గ్రామ పంచాయతీల సిబ్బంది కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేపడుతూనే 100 శాతం ఆన్‌లైన్‌ ఆడిటింగ్‌ను పూర్తి చేశారన్నారు. ఆన్‌లైన్‌ ఆడిటింగ్‌లో తమకు సహకరించాలని ఇతర రాష్ట్రాలు కోరాయన్నారు.   

మరిన్ని వార్తలు