టీకాలు ఎగిరొస్తాయ్‌!

9 Sep, 2021 04:45 IST|Sakshi

డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ల సరఫరాకు రంగం సిద్ధం 

11న వికారాబాద్‌లో కేటీఆర్‌తో కలిసి ప్రారంభించనున్న కేంద్ర మంత్రి సింథియా

తొలి రోజు ప్రయోగాత్మకంగా ఐదు పీహెచ్‌సీలకు..  ఏర్పాట్లు పరిశీలిస్తున్న మంత్రి సబిత, కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యేలు  

వికారాబాద్‌: దేశంలో డ్రోన్ల ద్వారా కోవిడ్‌ వ్యాక్సిన్‌ సరఫరాను ప్రారంభించే ప్రక్రియకు రంగం సిద్ధమైంది. తెలంగాణ నుంచే ఈ కార్యక్రమం ప్రారంభమవుతుండటం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ‘ఆకాశ మార్గం ద్వారా మందులు’ ప్రాజెక్టు ఈ నెల 11న ప్రారంభం కానుంది. విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌తో కలసి జిల్లా కేంద్రాల నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు డ్రోన్ల ద్వారా టీకా చేరవేసే ప్రక్రియను ప్రారంభించనున్నారు.

శనివారం ప్రయోగాత్మకంగా వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో కార్యక్రమం జరుగనుంది. జిల్లా పరిధిలోని ఐదు పీహెచ్‌సీలకు మొదటి రోజు డ్రోన్ల ద్వారా చేరవేయనున్నారు. వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని రామయ్యగూడ, వికారాబాద్‌ మండల పరిధిలోని సిద్దులూరు, ధారూర్‌ మండల పరిధిలోని నాగసముందర్, బంట్వారం, బొంరాస్‌పేట పీహెచ్‌సీలకు ముందుగా డ్రోన్ల ద్వారా సరఫరా చేస్తారు.

ఏర్పాట్లు చేస్తున్న యంత్రాంగం
కలెక్టర్‌ పర్యవేక్షణలో అధికారులు డ్రోన్ల ద్వారా టీకా సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విమానయాన శాఖ, పోలీసు శాఖల అనుమతులు, పీహెచ్‌సీలకు సరఫరా చేయాల్సిన టీకా బాక్సులు, నిల్వ తదితర అంశాలను పర్యవేక్షిస్తున్నారు. డ్రోన్లు గగనతలంలో ఎగరటం, గమ్యస్థానాలకు చేరే వరకు పర్యవేక్షణ, వాటి రక్షణను పోలీసు శాఖ పర్యవేక్షిస్తుంది. 

ఏర్పాట్లు పర్యవేక్షించిన మంత్రి సబితారెడ్డి
ఈ నెల 11న కార్యక్రమం జరిగే వికారాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం ఆవరణలోని మైదానాన్ని బుధవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. సభా వేదిక, డ్రోన్లు ఎగిరే ప్రదేశం, మీడియా గ్యాలరీ తదితరాలను పరిశీలించిన మంత్రి.. ఏర్పాట్లన్నీ పక్కాగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఆమె వెంట కలెక్టర్‌ నిఖిల, ఎస్పీ నారాయణ, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాలే యాదయ్య, ఫైలట్‌ రోహిత్‌రెడ్డి ఉన్నారు. అంతకుముందు వికారాబాద్‌ నుంచి అనంతగిరి రోడ్డులోని 100 పడకల ఆస్పత్రిని సబిత సందర్శించారు. కోవిడ్‌ పరీక్షల కోసం ఆర్టీపీసీఆర్‌ సెంటర్‌ ప్రారంభిస్తామని చెప్పారు. 

9–10 కి.మీ. దూరం వరకు.. 
డ్రోన్ల ద్వారా టీకాలను తీసుకెళ్తుండటం దేశంలో ఇదే తొలిసారి. అందువల్ల గురు, శుక్రవారాల్లో అధికారులు వీటిని పరీక్షించనున్నారు. ఈ రెండు రోజులు డ్రోన్లు కనుచూపు మేర నుంచి 500–700 మీటర్ల దూరం వరకు ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు. ఈనెల 11 నుంచి 9–10 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా సరఫరా చేయడాన్ని ప్రారంభిస్తారు. ఇవి టీకాతోపాటు, మందులు, ఇతర వైద్య పరికరాలను కూడా తీసుకెళ్తాయి. దీనికోసం డ్రోన్‌ఆధారితవస్తు రవాణాలో పేరొందిన స్కై ఎయిర్‌ కన్సార్టియం.. బ్లూడార్ట్‌ ఎక్స్‌ప్రెస్‌తో కలిసి పనిచేస్తోంది.     

మరిన్ని వార్తలు