అరువుపై ఎరువులు ఇవ్వం

5 Jun, 2022 02:12 IST|Sakshi

మార్క్‌ఫెడ్‌ కీలక నిర్ణయం 

నగదు చెల్లించిన సొసైటీలకే సరఫరా

ఈ సీజన్‌ నుంచే కొత్త విధానం

ఆర్థికంగా చితికిన సొసైటీలకు తిప్పలు

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: వ్యవసాయ సహకార సంఘాల (సొసైటీ)లకు అరువుపై ఎరువులు ఇచ్చేది లేదని మార్క్‌ఫెడ్‌ (తెలంగాణ రాష్ట్ర సహకార మార్కెటింగ్‌ ఫెడరేషన్‌) కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త విధానం ప్రకారం ఈ వానాకాలం సీజన్‌ నుంచి ముందు నగదు చెల్లించిన సొసైటీలకే ఎరువులు పంపుతామని తేల్చిచెబుతోంది.

ఏటా సహకార సంఘాలు అరువుపై ఎరువులు తీసుకుని వాటిని రైతులకు విక్రయించి.. వచ్చిన డబ్బును మార్క్‌ఫెడ్‌కు చెల్లిస్తుంటాయి. ఇకమీదట ఉద్దెరపై ఎరువులు అమ్మరాదని మార్క్‌ఫెడ్‌ తీసుకున్న నిర్ణయంతో ఆర్థికంగా చితికిన సహకార సంఘాల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఎరువులు కొనేందుకు డబ్బు ఎక్కడి నుంచి తేవాలని సొసైటీల చైర్మన్లు తర్జనభర్జన పడుతున్నారు.

బ్యాంకు గ్యారెంటీతోనైనా ఇవ్వాలని వినతి 
ఎరువుల కోసం ముందుగా నగదు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నామని, కనీసం బ్యాంకు గ్యారెంటీలతోనైనా సొసైటీలకు ఎరువులు పంపాలని సొసైటీల పాలకవర్గాలు మార్క్‌ఫెడ్‌ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాయి. దీనికోసం ఆయా జిల్లాల్లో కీలక ప్రజాప్రతినిధులు, మంత్రుల సిఫార్సు లేఖలను కూడా పంపుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఇలా ఐదు సొసైటీలు బ్యాంకు గ్యారెంటీ కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి.

కాగా, సొసైటీలకు గ్యారెంటీ ఇచ్చేందుకు బ్యాంకులు కూడా అనేక మెలికలు పెడుతున్నాయి. మార్క్‌ఫెడ్‌ వద్ద పాత బకాయిలన్నీ చెల్లించినట్లు నోడ్యూ సర్టిఫికెట్‌ తీసుకురావాలని బ్యాంకులు తేల్చి చెబుతున్నాయి. దీంతో సొసైటీల పాలకవర్గాలు నో డ్యూ సర్టిఫికెట్లకోసం మార్క్‌ఫెడ్‌ డీఎంలకు దరఖాస్తులు చేసుకుంటున్నాయి.

ఆర్థిక ఇబ్బందుల్లో 40 శాతం సొసైటీలు
రాష్ట్రంలో మొత్తం 818 సహకార సంఘాలుండగా, ఇందులో సుమారు 40 శాతం సంఘాలు ఆర్థికంగా చితికిపోయాయి. కొన్ని సొసైటీలైతే కనీసం సిబ్బందికి వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాయి. ధాన్యం కొనుగోళ్లు చేపట్టిన సొసైటీల ఆర్థిక పరిస్థితి మాత్రమే కొంత మెరుగ్గా ఉంది. ఈ కొనుగోళ్లపై వచ్చిన కమీషన్‌తోనే చాలా వరకు సొసైటీలు నిలదొక్కుకుంటున్నాయి. ధాన్యం సేకరణ లేని ప్రాంతాల్లో సొసైటీలు ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్నాయి.

ఎరువుల పంపిణీలో కీలక పాత్ర..
ఎరువుల పంపిణీలో సొసైటీలది కీలక పాత్ర. రాష్ట్రంలో సుమారు 60 శాతం ఎరువులు సొసైటీల ద్వారానే రైతులకు పంపిణీ అవుతున్నాయి. మిగతా 40 శాతం ప్రైవేటు డీలర్ల ద్వారా విక్రయిస్తుంటారు. రైతులకు సొసైటీల్లో ఎరువులు అందుబాటులో ఉంటే ప్రైవేటు వ్యాపారుల దోపిడీకి చెక్‌ పడు తుంది. సొసైటీల్లో ఎరువులు అందుబాటులో లేని పక్షంలో వ్యాపారులు అధిక ధరలకు విక్రయించి రైతులను నిలువు దోపిడీ చేస్తారు. మరో పక్షం రోజుల్లో వానాకాలం సాగు పనులు ఊపందు కుంటాయి.

ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ఎరువులు సరఫరా కావాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సగానికిపైగా సొసైటీల్లో ఈ వానాకాలం సీజన్‌లో ఎరువులు అందించే అవకాశం కనిపించడం లేదు. 

మరిన్ని వార్తలు