విద్యార్థులకేం కావాలి..?

13 Dec, 2022 01:01 IST|Sakshi
ఉన్నత విద్యామండలి సమావేశంలో పాల్గొన్న లింబాద్రి, వీసీలు, అధికారులు 

వాళ్లు ఏం కోరుతున్నారు? 

ఐఎస్‌బీ అధ్యయనం మొదలు 

స్టూడెంట్స్‌ మనోగతంపై విశ్లేషణ 

వివరాలు ఇచ్చిన వీసీలు.. ఉన్నత విద్యా మండలిలో సమావేశం 

సాక్షి, హైదరాబాద్‌: ఉన్నత విద్యలోకి ప్రవేశించే విద్యార్థులు ఏం ఆశిస్తున్నారనే అంశంపై లోతుగా అధ్యయనం చేపట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి అభిప్రాయపడింది. విద్యార్థులకేం కావాలి.? వాళ్లు ఏం కోరుకుంటున్నారు.. అనే ప్రాతిపదికన పరీక్షల విధానం, వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు మూల్యాంకన విధానం రూపొందించే దిశగా ముందుకెళుతోంది.

ఉన్నత విద్యామండలి, కమిషనర్‌ ఆఫ్‌ కాలేజీ ఎడ్యుకేషన్‌ సంయుక్తంగా ఉన్నత విద్య పరీక్షల విధానంలో తీసుకురావాల్సిన మార్పులపై అధ్యయనానికి ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌(ఐఎస్‌బీ) తోడ్పాటు తీసుకోనున్నాయి. ఇందుకోసం ఐఎస్‌బీతో ప్రత్యేక అధ్యయనం చేయిస్తున్నట్టు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఇక్కడ కీలక భేటీ జరిగింది.

సమావేశంలో పలు విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్స్‌లర్లు, ఏడు డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాళ్లు   పాల్గొన్నారు. పరీక్షలు, మూల్యాంకన విధానంలో తీసుకురావాల్సిన మార్పులపై చర్చించారు.  ఉన్నత విద్య పూర్తి చేసిన విద్యార్థులకు మార్కెట్లో ఉన్న అవకాశాలు, పారిశ్రామిక రంగం కోరుకునే అర్హతలపై ఐఎస్‌బీ విశ్లేషణకు ఈ డేటాను వాడుకోనుంది. 

మార్పు అనివార్యం: నవీన్‌ మిత్తల్‌ 
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మూల్యాంకన విధానంలో మార్పులు అవసరమని, దీనికి ప్రత్యేక అధ్యయనం చేయాలని కాలేజీ విద్య కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ అభిప్రాయపడ్డారు. ఈ ఉద్దేశంతోనే ఐఎస్‌బీతో క్షేత్రస్థాయి అధ్యయనం చేపట్టినట్టు తెలిపారు. దీనివల్ల ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు. ఉపాధి, ఎంటర్‌ ప్రెన్యూర్, సాధికారతకు మూల్యాంకన, విద్యా బోధనలో మార్పులు చేసేందుకు ఐఎస్‌బీ అధ్యయనం కీలకం కానుందని ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌. లింబాద్రి అన్నారు. ఐఎస్‌బీ అధ్యయనం తర్వాత ఉపాధి అవసరాలకు తగ్గట్టుగా బోధన ప్రణాళికల్లో మార్పు వచ్చే వీలుందన్నారు. తాము చేపట్టబోయే అధ్యయనం గురించి ఐఎస్‌బీ ప్రతినిధి ప్రొఫెసర్‌ చంద్రశేఖర్‌ శ్రీపాద ఈ సందర్భంగా వివరించారు. కార్యక్రమంలో మండలి వైస్‌–చైర్మన్‌ ప్రొఫెసర్‌ వి. వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు