కోళ్ల వ్యర్థాలతో బయోగ్యాస్‌ తయారీ

8 Jan, 2021 01:49 IST|Sakshi
ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో హిమదీప్‌ తదితరులు

రాష్ట్రంలోనే తొలి ప్రాజెక్ట్‌ ఉడిత్యాల్‌లో ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌ : పౌల్ట్రీఫారమ్‌లోని కోళ్ల వ్యర్థాల ఆధారంగా పనిచేసే తొలి బయోగ్యాస్‌ ప్రాజెక్ట్‌ రాష్ట్రంలో ఏర్పాటైంది. హైదరాబాద్‌ శివారులోని ఉడిత్యాల్‌ గ్రామంలో సోలికా ఎనర్జీ, శ్రీనివాస హ్యచరీస్, ఎక్స్‌ఈఎంఎక్స్‌ ప్రాజెక్ట్స్‌ సంయుక్తంగా ఏర్పాటుచేసిన ఈ ప్రాజెక్ట్‌ గురువారం ప్రారంభమైంది. భారతదేశ క్లీన్‌ ఎనర్జీ లక్ష్యాలను సాధించడంలో భాగంగా ఈ ప్రాజెక్ట్‌ను ఏర్పాటుచేశారు. రోజుకు 2.4 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ (సీబీజీ) ప్రాజెక్ట్‌ను ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓఎల్‌) ఈడీ ఆర్‌ఎస్‌ఎస్‌ రావు ప్రారంభించారు. 4.50 లక్షల కోళ్లు కలిగిన అతిపెద్ద కోళ్ల ఫారమ్‌ పక్కన దీనిని ఏర్పాటుచేశారు.

కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని చౌకైన రవాణా పథకం కింద సోలికా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించింది. ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి చేసే బయోగ్యాస్‌ను అత్తాపూర్‌లోని ఐఓఎల్‌ ఔట్‌లెట్‌కు సరఫరా చేయనున్నారు. రాష్ట్రంలో 3.6 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో రెండో బయోగ్యాస్‌ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు సోలికా ప్రమోటర్‌ హిమదీప్‌ నల్లవడ్ల తెలిపారు.

మరిన్ని వార్తలు