ఒక్కరోజులోనే 3.09 లక్షల కార్డులు

27 Jul, 2021 02:36 IST|Sakshi
కొత్త రేషన్‌కార్డును అందజేస్తున్న మంత్రులు గంగుల, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే గండ్ర

రేషన్‌కార్డులు పంపిణీ చేసిన రాష్ట్రప్రభుత్వం

ఇది దేశంలోనే రికార్డు: మంత్రి గంగుల

భూపాలపల్లి: ఇది సరికొత్త రేషన్‌ రికార్డు.. సోమవారం ఒక్కరోజే రాష్ట్ర ప్రభుత్వం 3,09,083 రేషన్‌కార్డులను లబ్ధిదారులకు అందజేసింది. పేదల ఖాళీ కడుపులను నింపే క్రమంలో రికార్డు సృష్టించింది. ఇంత పెద్దసంఖ్యలో రేషన్‌కార్డులు పంపిణీ చేయడం దేశంలోనే ఇది తొలిసారి అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. కొత్త రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 90.50 లక్షల రేషన్‌కార్డుల ద్వారా 2.88 కోట్లమంది లబ్ధిదారులకు రూ.2,766 కోట్ల విలువైన ఆహారధాన్యాలు అందిస్తున్నట్లు తెలిపారు.

కరోనా సంక్షోభంలోనూ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని కొనియాడారు. 2014కు ముందు అర్హులు సైతం రేషన్‌కార్డు కోసం పైరవీకారులను ఆశ్రయించేవారని, తాను 2009లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు అడుక్కున్నా అప్పటి ప్రభుత్వం ఒక్క కార్డు కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. ఇప్పుడు పైరవీలకు తావివ్వకుండా, పారదర్శకంగా అర్హులందరికీ రేషన్‌కార్డులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ పేదల కడుపు నింపాలనే సదుద్దేశంతో కొత్త రేషన్‌కార్డులను మంజూరు చేయడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు