చోటా సన్మాన్‌.. బడా దావత్‌! ప్లేట్‌ బిర్యానీకి రూ.700? మరో విశేషం ఏంటంటే!

3 Dec, 2022 12:10 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ప్రజాధనం దుర్వినియోగమవుతోంది. ధార్మిక సేవల కోసం వినియోగించాల్సిన సర్కారీ సొమ్ము పక్కదారి పడుతోంది. యాత్రికులకు ఉత్తమ సేవలు అందించినవారికి అవార్డుల పేరుతో హజ్‌ కమిటీ భారీగా నిధులను దుబారా చేసింది. ఆతిథులకు మెగా విందును ఏర్పాటు చేసి ఖజానాకు గండికొట్టింది. ప్లేట్‌ బిర్యానీకి ఏకంగా రూ.700 చెల్లించి భారీగా వెనకేసుకుంది. కేవలం 200 మంది అతిథులను మాత్రమే ఆహ్వానించినట్లు చెప్పుకున్న కమిటీ.. బిల్లుల చెల్లింపుల వరకు వచ్చేసరికి ఈ సంఖ్యను 350 చేసేసింది.

ఇలా ఏకంగా రూ.3.5 లక్షలను ఈ దావత్‌కు వెచ్చించింది. మరో విచిత్రమేమింటే.. ఈ ఆతిథ్యమిచ్చిన హోటల్‌ హజ్‌ కమిటీ చైర్మన్‌ది కావడం మరో విశేషం. హజ్‌ యాత్రికుల కోసం శిబిరం ఏర్పాటు చేసేందుకు ఏటా బడ్జెట్‌లో రూ.2 కోట్లను ప్రభుత్వం కేటాయిస్తోంది. ఈ నిధులకు అదనంగా చైర్మన్‌ పలుకుబడిని ఉపయోగించి మరో రూ.2 కోట్లను ప్రభు త్వం నుంచి రాబట్టారు. ఆర్థిక సంవత్సరం దగ్గర పడుతుండటంతో మంచినీళ్లలా నిధులను ఖర్చు చేస్తున్న హజ్‌ యంత్రాంగం.. లెక్కా పద్దు కూడా చూసుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.   
(చదవండి: NGRI Hyderabad: ఆ గనుల్లో బంగారం కంటే విలువైన లోహం)

మరిన్ని వార్తలు