కోర్సు చెయ్యి.. పంట వెయ్యి

2 Jan, 2022 02:19 IST|Sakshi

సర్టిఫికెట్‌ కోర్సులను ప్రారంభించనున్న ఉద్యాన వర్సిటీ

ఈ నెల 17 నుంచి మొదలు.. తొలుత మూడు కోర్సులు

కూరగాయలు, పూలు, ఆయిల్‌ పామ్‌ సాగుపై పాఠాలు

ఒక్కో కోర్సు 10 రోజులు.. ఒక్కో బ్యాచ్‌లో 20 మంది

సాక్షి, సిద్దిపేట: యాసంగిలో వరి వేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు ఏ పంటలు వేయాలని ఆలోచనలో పడ్డారు. ఇలాంటి సమయంలో వీళ్లను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించేందుకు వ్యవసాయ శాఖ నడుం బిగించింది. రైతులు, యువ రైతులకు కొత్త పంటలపై అవగాహన పెంచేందుకు సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం సర్టిఫికెట్‌ కోర్సులను ప్రారంభించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని రెండు పరిశోధన స్థానాల్లో 3 సర్టిఫికెట్‌ కోర్సులను మొదలుపెట్టబోతోంది. 

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని పరిశోధన స్థానంలో కూరగాయల సాగు, పూల మొక్కల పెంపకం గురించి.. భద్రాద్రి కొత్తగుడెం జిల్లా అశ్వారావుపేటలోని పరిశోధన స్థానంలో ఆయిల్‌ పామ్‌ పెంపకం, నిర్వహణ గురించి సర్టిఫికెట్‌ కోర్సుకు శిక్షణ ఇవ్వనుంది. ఆయిల్‌ పామ్‌ శిక్షణ ఈ నెల 17 నుంచి 28వ తేదీ వరకు.. కూరగాయలు, పూల మొక్కల పెంపకం కోర్సులు ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 1 వరకు కొనసాగనున్నాయి.

ఒక్కో కోర్సు 10 రోజులు.. ఫీజు రూ. 5 వేలు
కోర్సుకు సంబంధించిన ప్రతి బ్యాచ్‌లో 20 మందికి థియరీ, ప్రాక్టికల్స్‌ను వివరించను న్నారు. వీటికి స్టడీ మెటిరీయల్‌నూ అందించనున్నారు. ఒక్కో కోర్సు 10 రోజుల పాటు కొనసాగనుంది. ఈ కోర్సుకు రూ. 5 వేల ఫీజు వసూలు చేయనున్నారు. కోర్సుకు దరఖాస్తు చేసుకునేందుకు www.rktrhu. ac.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

రూ. 5 వేల డీడీతో పాటు దరఖాస్తును ‘ది డైరెక్టర్‌ ఆఫ్‌ రీసెర్చ్, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీస్, శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన వన విశ్వవి ద్యాలయం, ములుగు, జిల్లా సిద్దిపేట’కు పంపాలి. కోర్సు పూర్తయ్యాక సర్టిఫికెట్లను అందిస్తారు. తొలి విడతలో మూడు కోర్సు లు, త్వరలో మరిన్ని కోర్సులను ప్రారంభిం చేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

యువ రైతులు సద్వినియోగం చేసుకోవాలి
పంటల సాగుపై సర్టిఫికెట్‌ కోర్సులను వర్సిటీ ఆధ్వర్యంలో తొలిసారి ప్రారంభిస్తున్నాం. చాలా మంది నెట్‌లో చూసి నేర్చుకుంటున్నా.. వాళ్లకు కావాల్సింది తెలియదు. ఈ కోర్సు శిక్షణలో వారికి కావాల్సింది నేర్పిస్తారు. ఉద్యాన శాఖ అమలు చేసే ప్రభుత్వ పథకాలను ఆ శాఖ వారు వచ్చి ఓ రోజు వివరిస్తారు. 10 రోజులు శిక్షణ పూర్తయ్యాక సర్టిఫికెట్‌  అందిస్తాం. దరఖాస్తులకు చివరి తేదీ లేదు. ఒక్కో బ్యాచ్‌ 20 మందితో నిర్వహిస్తాం.    


– భగవాన్, వర్సిటీ రిజిస్ట్రార్‌ 

మరిన్ని వార్తలు