స్టార్టప్‌లకు స్వర్గధామం.. టీఎస్‌ఐఆర్‌ఐఐ

2 Mar, 2022 20:40 IST|Sakshi

టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో ఇన్నోవేషన్‌ సెల్‌

పల్లెల్లో వెలుగులు నింపేందుకు చేయూత

రూ.30 లక్షల వరకు ఆర్థిక సాయం 

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌లో పురుడు పోసుకున్న పలు అంకుర పరిశ్రమలు ఇప్పుడు పల్లెబాట పట్టనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికవృద్ధి, ఉపాధి కల్పనకు బాటలు పరిచే అంకుర పరిశ్రమలకు ఆర్థిక చేయూతనందించేందుకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఐఐసీ) అధిక ప్రాధాన్యమిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ దిశానిర్దేశం మేరకు ఆయా స్టార్టప్‌లకు రూ.30 లక్షల వరకు ఆర్థిక సాయం అందజేసే అవకాశాలున్నట్లు టీఎస్‌ఐఐసీ వర్గాలు  తెలిపాయి. ఇందులో ప్రయోగాత్మకంగా చేపట్టే ప్రాజెక్టులకు సైతం సాయం అందుతుందని స్పష్టం చేశాయి. ఇందుకోసం తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్స్‌ ఫర్‌ రూరల్‌ ఇంపాక్ట్‌ ఇన్సెంటివ్స్‌ (టీఎస్‌ఐఆర్‌ఐఐ) పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపాయి.  

► ఈ పథకం అమలుకు సంబంధించిన బాధ్యతలను తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ నిర్వర్తిస్తుందని పేర్కొన్నాయి. ఆర్థిక సాయం సూక్ష్మ, చిన్న, కుటీర, మధ్యతరహా పరిశ్రమలు, వీటికి సంబంధించిన సాంకేతికతను అభివృద్ధి చేసే స్టార్టప్‌ సంస్థలకు వర్తిస్తుందని తెలిపాయి. ఈ పథకానికి సంబంధించి హెచ్‌టీటీపీఎస్‌://టీమ్‌టీఎస్‌ఐసీ.తెలంగాణ.జీఓవీ.ఐఎన్‌/టీఎస్‌ఐఆర్‌ఐ–ఇన్సెంటివ్స్‌/ అనే సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న సంస్థలను టీఎస్‌ఐసీ ఏర్పాటు చేసిన గ్రాస్‌రూట్స్‌ అడ్వైజరీ కౌన్సిల్‌ మూల్యాంకనం చేస్తుందని.. ఆయా సాంకేతికత ద్వారా ఒనగూరే ప్రయోజనాలను విశ్లేషిస్తుందని టీఎస్‌ఐఐసీ వర్గాలు తెలిపాయి.  

నగరం నుంచి పల్లెలకు... 
► నగరంలో అంకుర పరిశ్రమలకు స్వర్గధామంలా మారిన టీహబ్‌లో నూతనంగా వందలాది స్టార్టప్‌లు పురుడు పోసుకున్న విషయం విదితమే. వీటిలో ప్రధానంగా ఐటీ, అనుబంధ రంగాలు, సేవలు, బ్యాంకింగ్, హెల్త్‌కేర్, ఇన్సూరెన్స్‌ ఇతర సేవారంగ విభాగానివే అత్యధికంగా ఉన్నాయి. ఈ నూతన పథకంతో స్టార్టప్‌లు ఇప్పుడు నగరంలోనే పురుడు పోసుకున్నప్పటికీ.. పల్లెలకు తరలివెళ్లనున్నాయి. (క్లిక్‌: హెచ్‌ఎండీఏ ప్లానింగ్‌లో దళారుల దందా : ఆమ్యామ్యాలు లేకుంటే పెండింగే)

► గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ప్రధానంగా వ్యవసాయం, పాడి పరిశ్రమ, హార్టికల్చర్, చేనేత, ఇతర కుటీర పరిశ్రమలకు సాంకేతిక దన్ను అందించడం, వారి ఉత్పత్తులకు బ్రాండింగ్, మార్కెటింగ్‌ సదుపాయం కల్పించడం ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు స్టార్టప్‌లు రూపొందించే టెక్నాలజీ దోహదం చేయనుంది. ఈ సంస్థలు రూపొందించే ఉత్పత్తులు లేదా సాంకేతికత గ్రామీణుల జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే ఈ పథకం ఉద్దేశమని నిపుణులు చెబుతుండడం విశేషం.  

మరిన్ని వార్తలు