వామ్మో.. ‘మోత’ మోగిస్తున్నారు!

18 Aug, 2021 20:39 IST|Sakshi

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ప్రమాణాలకు మించి శబ్దాలు

రాత్రిళ్లు మరింతగా పెరిగిన వాహనాల ధ్వనులు, మల్టీ హారనింగ్‌తో సమస్యలు

పలు జిల్లాల్లో తగ్గుతున్న వాయు నాణ్యత

మే, జూన్, జూలైలో టీపీసీబీ గణాంకాల్లో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాలోని పలు ప్రాంతాల్లో ధ్వని, వాయు కాలుష్య సమస్యలు పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో శబ్దాల సమస్య మితిమీరుతుంటే, కొన్ని జిల్లాలు, పట్టణాల్లో వాయు నాణ్యతా ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. వాతావరణ పరిస్థితుల కారణంగా హైదరాబాద్‌లో గతంలో ఉన్న వాయు కాలుష్య సమస్య కొంత తగ్గుముఖం పట్టగా జిల్లాలు, ముఖ్య పట్టణాల్లో వాయు నాణ్యత తక్కువగా నమోదవుతోంది. వేసవిలో సెకండ్‌వేవ్‌ సందర్భంగా లాక్‌డౌన్‌ అమలు, తర్వాత వర్షాకాలం నేపథ్యంలో హైదరాబాద్‌లో వాయు కాలుష్యం తగ్గిందని, చలికాలం వచ్చేటప్పటికి మళ్లీ కాలుష్యం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ) గత 3 నెలల (మే, జూన్, జూలై) వెల్లడించిన గణాంకాలను విశ్లేషిస్తే ఈ విషయమే స్పష్టమవుతోంది.

శబ్ద ప్రమాణాలు 
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశిత శబ్ద ప్రమాణాల ప్రకారం వివిధ ›ప్రాంతాల వారీగా పగలు, రాత్రి సమయాల్లో వెలువడే ధ్వనులు కింద సూచించిన మేర ఆయా స్థాయిలు పగటిపూట (ఉదయం 6 నుంచి రాత్రి 10 లోపు), రాత్రి సమయాల్లో (రాత్రి 10 నుంచి ఉదయం 6 లోపు) డెసిబుల్స్‌ లోబడి ఉండాలి.

ఇవీ సీపీసీబీ వాయు నాణ్యతా ప్రమాణాలు..
సీపీసీబీ నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలను బట్టి వాయు నాణ్యతా సూచీ (ఏక్యూఐ) 0–50 పాయింట్ల మధ్యలో ఉంటే గాలి నాణ్యత బాగా ఉన్నట్లు, ఈ పరిమితిలో ఉంటే ఆరోగ్యపరంగా సమస్యలు ఉత్పన్నం కావు.
► 50–100 పాయింట్ల మధ్యలో ఏక్యూఐ ఉంటే ఆరోగ్యపరమైన సమస్యలున్న వారికి గాలి పీల్చుకోవడంలో, ఇతరత్రా సమస్యలు ఎదురవుతాయి.

► 101–200 పాయింట్ల మధ్యలో ఏక్యూఐ ఉంటే ఊపిరితిత్తుల సమస్యలు, ఆస్థమా, గుండె సంబంధిత జబ్బులున్న వారికి గాలి పీల్చుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

► వాయు నాణ్యత మరింత తగ్గి 200 పాయింట్ల ఏక్యూఐని మించిన గాలిని దీర్ఘకాలం పాటు పీలిస్తే అనారోగ్యం, శ్వాసకోశ సంబంధిత, ఇతర సమస్యలు ఎదుర్కొంటున్న వారిపై తీవ్ర ›ప్రభావం పడుతుంది.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గత 3 నెలల్లో వాయు నాణ్యతా ప్రమాణాలు ఇలా (ఎక్యూఐ పాయింట్లలో)

మల్టీ హారన్స్‌ వల్లే..
హైదరాబాద్‌లో శబ్దకాలుష్యం క్రమంగా పెరుగుతోంది. వివిధ రకాల వాహనాలు, నిర్మాణ రంగ కార్యకలాపాలు, వివిధ అభివృద్ధి పనులు, ఇతర రూపాల్లో రోజువారీ కార్యక్రమాల్లో ప్రమాణాలకు మించి పెరుగుతున్న ధ్వనులు ఈ పరిస్థితికి కారణం. ముఖ్యంగా రాత్రి సమయాల్లో వివిధ నిర్దేశిత ప్రాంతాల్లో నిర్ణీత ప్రమాణాల కంటే శబ్దాలు ఎక్కువగా నమోదు కావడానికి మల్టీహారన్స్‌ వినియోగం ప్రధాన కారణంగా గుర్తించాం. అంతర్రాష్ట్ర బస్సు, లారీ సర్వీసులు, ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా మల్టీ హారన్స్‌ వినియోగంతో ఈ సమస్య పెరుగుతోంది. దీని నియంత్రణకు పోలీసు, రవాణా శాఖలు తగిన చర్యలు చేపడుతున్నాయి.
– టీపీసీబీ ధ్వని, కాలుష్య నియంత్రణ అధికారులు

వినికిడి శక్తికి ప్రమాదం..
ప్రజల ఆరోగ్యం, వారి వివిధ అవయవాలు, శరీర భాగాలపై వాయు, నీరు, ధ్వని ఇతర రూపాల్లోని కాలుష్యాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వాయు కాలుష్యం ఊపిరితిత్తులు, గుండె ఇతర ముఖ్యమైన భాగాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేస్తోంది. శబ్ద కాలుష్యం వినికిడి, ఇతర మానసిక సమస్యలకు దారితీస్తోంది. రోజూ 8 గంటల పాటు 85 డెసిబుల్స్‌ ఉన్న ధ్వనికి గురైతే వినికిడి సమస్యలు మరింత పెరుగుతాయి. 90కు మించి డెసిబుల్స్‌తో వెలువడే శబ్దాలకు చెవులు, 120 డెసిబుల్స్‌ కంటే ఎక్కువ శబ్దాలకు కర్ణ భేరి దెబ్బతిని, వినికిడి శక్తి కోల్పోతారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, రాజకీయ పార్టీల ప్రచారాల్లో మోగించే డీజే సౌండ్లు అనేక అనర్థాలకు కారణమవుతు న్నా యి. చిన్నపిల్లల్లో మానసిక సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదముంది.
– డా.ఎం.మోహన్‌రెడ్డి, చీఫ్‌ ఈఎన్‌టీ స్పెషలిస్ట్, నోవా హాస్పిటల్‌ 

మరిన్ని వార్తలు