తెలంగాణలో డెంగీ కేసులు 6,284

15 Dec, 2021 04:34 IST|Sakshi

రాష్ట్రంలో గత ఏడాది కంటే మూడు రెట్లు అధికంగా నమోదు

దేశంలోనే పదో స్థానం

కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఈ ఏడాది డెంగీ కేసులు అధికంగా నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే దాదాపు మూడు రెట్లు అధికంగా నమోదు కావడం గమనార్హం. ఈ ఏడాది నవంబర్‌ 21వ తేదీ నాటికి 6,284 డెంగీ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది. ఈ మేరకు వివిధ సంవత్సరాల్లో దేశంలో డెంగీ కేసులు ఏస్థాయిలో నమోదయ్యాయో సమగ్ర నివేదిక విడుదల చేసింది. వివిధ రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ కేసుల విషయంలో పదో స్థానంలో ఉందని వివరించింది.

అత్యంత ఎక్కువగా ఉత్తరప్రదేశ్‌లో 27,506 డెంగీ కేసులు నమోదు కాగా, అత్యంత తక్కువగా అరుణాచల్‌ప్రదేశ్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. ఇక లడఖ్, లక్షద్వీప్‌లో డెంగీ కేసులు నమోదు కాలేదని కేంద్రం తెలిపింది. గతేడాది దేశవ్యాప్తంగా 44,585 డెంగీ కేసులు నమోదు కాగా, 66 మంది చనిపోయారు. ఈ ఏడాది 1.64 లక్షల కేసులు నమోదు కాగా, 146 మంది చనిపోయారు. అందులో ఒక్క మహారాష్ట్రలోనే 70 మంది చనిపోవడం ఆందోళన కలిగించే అంశం.  

మరిన్ని వార్తలు