నా ఫ్రెండ్‌ను చదివించండి

1 Jul, 2022 02:28 IST|Sakshi
మాట్లాడుతున్న సంధ్య

చైల్డ్‌ ఫ్రెండ్లీ పంచాయత్‌లో ఓ విద్యార్థిని అభ్యర్థన

కౌడిపల్లి(నర్సాపూర్‌): తాను చదువుకుం టోంది... తన స్నేహితురాలు మాత్రం చదువు మాని ఇంటివద్దే ఉంటోంది. అది ఆమెను బాధించింది. అందుకే ‘నా ఫ్రెండ్‌ను చదివించండి’ అంటూ పాఠశాలకు వచ్చిన ప్రజాప్రతినిధులు, అధికారులను వేడుకుంది. మెదక్‌ జిల్లా మహ్మద్‌ నగర్‌గేట్‌ తండాకు చెందిన సంధ్య, కౌడిపల్లి బాలికల ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది.

అదే తరగతికి చెందిన ఆమె ఫ్రెండ్‌ నందిని నలుగురు ఆడపిల్లల్లో పెద్దది. ఇటీవలే ఆమె స్కూల్‌ మానేసి ఇంటివద్దే ఉంటోంది. స్నేహితురాలు పాఠశాలకు రాకపోవ డం సంధ్యను బాధపెట్టింది. ఈ క్రమంలో పాఠశాలలో గురువారం నిర్వహించిన ‘ఫ్రెండ్లీ పంచాయత్, లింగ వివక్ష’ అవగాహన సదస్సులో విద్యార్థులు పలు సమస్యలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా సంధ్య ‘నా ఫ్రెండ్‌ నాకంటే బాగా చదువుతుంది. కానీ తల్లిదండ్రులు వద్దని చెప్పడంతో చదువు మానేసి ఇంట్లోనే ఉంటోంది. నా ఫ్రెండ్‌ను చదివించండి’ అంటూ కోరింది. బాలిక అభ్యర్థనకు స్పందించిన రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, అధికారులు.. నందినిని తప్పకుండా చదివిస్తామని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు