జేఈఈ మెయిన్‌ ఫలితాలు విడుదల

9 Mar, 2021 12:39 IST|Sakshi

కేటగిరీ స్కోరులో మాత్రం టాపర్లుగా... 

జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో రాష్ట్ర విద్యార్థుల పరిస్థితి

చాయిస్‌ ప్రశ్నల్లో తప్పులతో గందరగోళం 

ఫిమేల్‌ కేటగిరీలో టాపర్‌గా రాష్ట్ర విద్యార్థి

300 మార్కులకు రాష్ట్రంలో 290 అత్యధిక మార్కులు 

సాక్షి, హైదరాబాద్‌: ఎట్టకేలకు జేఈఈ మెయిన్‌ ఫలితాలు విడుదల అయ్యాయి. అయితే ఈసారి తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు వెనుకబడ్డారు. ఎప్పుడూ 100 పర్సెంటైల్‌ స్కోర్‌ సాధించే రాష్ట్ర విద్యార్థులు.. జేఈఈ ఫిబ్రవరి సెషన్‌లో 100 పర్సెంటైల్‌ సాధించలేకపోయారు. రాష్ట్రాల వారీ, కేటగిరీల వారీ ఉన్న 41 మంది టాపర్స్‌లో రాష్ట్ర విద్యార్థులు ఇద్దరు ఉన్నారు. అందులో చల్లా విశ్వనాథ్‌ 100 పర్సెంటైల్‌కు 99.9990421, కొమ్మ శరణ్య 99.9990421 పర్సెంటైల్‌ సాధించారు. అత్యధిక మార్కులు 300కు 290 మార్కులు రాష్ట్ర విద్యార్థులకు లభించాయి. కాగా, సోమవారం ఉదయమే వస్తాయనుకున్న జేఈఈ మెయిన్‌ ఫలితాలను ఎట్టకేలకు రాత్రికి విడుదల చేశారు. జేఈఈ మెయిన్‌ వెబ్‌సైట్‌లో (jeemain.nta.nic.in) ఫలితాల లింకులు అందుబాటులోకి తెచ్చారు.

ప్రశ్నల్లో తప్పులతో గందరగోళం.. 
గత నెలలో నిర్వహించిన మొదటి విడత జేఈఈ మెయిన్‌ పరీక్షల్లో ఇచ్చిన చాయిస్‌ ప్రశ్నల్లో దొర్లిన తప్పులు ఫలితాల వెల్లడిలో ప్రతిష్టంభనకు కారణమయ్యాయి. జేఈఈ మెయిన్‌ పరీక్షల్లో (న్యూమరికల్‌ వాల్యూ విభాగంలో) గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం ప్రతి సబ్జెక్టుల్లో సెక్షన్‌–బి కింద 10 చొప్పున ప్రశ్నలు ఇచ్చి వాటిల్లో ప్రతి సబ్జెక్టులో ఏవేనా 5 ప్రశ్నలకు సమాధానాలు రాసే వెసులుబాటు కల్పించారు. ఇలా మూడు సబ్జెక్టుల్లో 30 ప్రశ్నలు ఇచ్చి, 15 ప్రశ్నలకు సమాధానాలు రాయాలని అడిగారు. అయితే తప్పుల్లేకుండా ప్రశ్నపత్రాలు రూపొందించడంలో ఎన్‌టీఏ విఫలమైంది. ఆ తప్పులు చాయిస్‌ ఉన్న విభాగంలో రావడం మరింత సమస్యగా మారింది.

గందరగోళానికి కారణమిదీ.. 
ఈ ఏడాది జేఈఈ మెయిన్‌ను ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మొత్తం నాలుగు సార్లు నిర్వహిస్తామని ఎన్‌టీఏ ప్రకటించింది. అందులో భాగంగా మొదటి విడత పరీక్షలను ఫిబ్రవరి 23 నుంచి 26వ తేదీల్లో రోజు రెండు సెషన్లలో నిర్వహించింది. అందులో మొదటి రోజు బీ–ఆర్క్, బీ–ప్లానింగ్‌కు నిర్వహించగా, 24 నుంచి 26 వరకు బీఈ/బీటెక్‌ కోసం జేఈఈ పరీక్షలను 6 సెషన్లలో నిర్వహించింది. అయితే 24 ఉదయం సెషన్‌లో ఫిజిక్స్‌లో రెండు ప్రశ్నలను (1 సాధారణం, మరొకటి న్యూమరికల్‌), కెమిస్ట్రీలో 1 న్యూమరికల్‌ ప్రశ్నను, అదేరోజు రెండో సెషన్‌లో కెమిస్ట్రీలో మరో ప్రశ్నకు సబంధించి కీలో మార్పులు చేశారు. అదే రోజు 2వ సెషన్‌ గణితంలో 2 ప్రశ్నలను డ్రాప్‌ చేశారు. 26న మొదటి సెషన్‌ గణితంలో ఒక పశ్నను తొలగించారు.

ఫిజిక్స్‌లో ఒక ప్రశ్నను డ్రాప్‌ చేశారు. అలాగే అదే రోజు ఫిజిక్స్‌లో 3, కెమిస్ట్రీలో 3 న్యూమరికల్‌ ప్రశ్నల జవాబుల కీలను మార్చారు. 25న ఫిజిక్స్‌లో 1 ప్రశ్నను డ్రాప్‌ చేయగా, కెమిస్ట్రీలో 3 న్యూమరికల్‌ ప్రశ్నల కీలను మార్పు చేశారు. సాధారణంగా అయితే ఆ ప్రశ్నలకు ఒక్కో దానికి 4 మార్కులు హాజరైన విద్యార్థులందరికీ కలుపుతారు. అయితే ఆ ప్రశ్నలను చాయిస్‌లో వదిలేసి గణితంలో 100 శాతం మార్కులు సాధించిన విద్యార్థులకు ఇప్పుడు అదనంగా కలిసే మార్కుల వల్ల వారి మార్కులు వంద శాతానికి పైగా రానుంది. అయితే 100 శాతం మార్కులకు బదులుగా బోనస్‌ మార్కులతో వచ్చే 100 శాతానికిపైగా మార్కులను పరిగణనలోకి తీసుకొని లెక్కిస్తే, ఆ సెషన్‌లో విద్యార్థులకు కొంత మేర న్యాయం జరిగినా, అన్ని స్లాట్లను కలిపి ర్యాంకులు కేటాయించేటప్పుడు ఇతర సెషన్ల వారికి నష్టమేనని నిపుణులు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు