బకాయిల కుప్పలు .. విద్యార్థులకు తిప్పలు

7 Aug, 2021 01:37 IST|Sakshi

ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల నిధుల విడుదలలో జాప్యం

రెండేళ్లలో రూ. 3 వేల కోట్లకు పైగా పెండింగ్‌

ప్రారంభమే కాని 2020–21 నిధుల పంపిణీ

‘నెలవారీ నిధులు’ విడుదలలో సర్కారు తాత్సారం

విద్యార్థులపై కళాశాలయాజమాన్యాల ఒత్తిడి

అప్పులు చేసి ఫీజులు చెల్లిస్తున్న విద్యార్థులు

రెండు సంవత్సరాలుగా నిధులు అందకపోవడంతో రూ.5.5 లక్షల అప్పు చేసి ఫీజు చెల్లించిన చైతన్యపురికి చెందిన పీజీ వైద్య విద్యార్థిని తండ్రి రెండు నెలలుగా హైదరాబాద్‌ బీసీ సంక్షేమ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.

సాక్షి, హైదరాబాద్‌:  ఫీజు రీయింబర్స్‌మెంట్, పోస్టు మెట్రిక్‌ ఉపకార వేతనాల బకాయిలు పేరుకుపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. రీయింబర్స్‌మెంట్‌ నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో, ప్రభుత్వ పథకంపైనే ఆధారపడిన విద్యార్థులు అప్పులు చేసి కాలేజీల యాజమాన్యాలకు ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. రెండేళ్లుగా నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది. 2019–20 విద్యా సంవత్సరం బకాయిలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో విడుదల కాలేదు. ఇక 2020–21కి సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ నిధుల పంపిణీ ఇంకా మొదలే కాలేదు. రెండేళ్లకు కలిపి మొత్తం రూ.3017.41 కోట్ల బకాయిలున్నట్లు సంక్షేమ శాఖల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కోవిడ్‌–19 వ్యాప్తి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థపై పడిన ప్రభావం.. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకారవేతన పథకాలనూ ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. క్రమం తప్పకుండా జరగాల్సిన నిధుల విడుదలలో జాప్యం కారణంగా కొన్నిచోట్ల కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేస్తున్నాయి. మరోవైపు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు అందక పోవడంతో సిబ్బందికి జీతాలు చెల్లించడం కష్టతరంగా మారుతోందని యాజమాన్యాలు అంటున్నాయి.

జాడలేని నెలవారీ నిధులు
మూడేళ్ల క్రితం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. మొదట్లో ప్రతి విద్యా సంవత్సరం చివర్లో నిధులను మంజూరు చేసేవారు. అయితే పెద్దమొత్తంలో నిధులు ఒకేసారి విడుదల చేయడం భారంగా మారుతుండటంతో నెలవారీగా నిధులు విడుదల చేయాలని భావించింది. సాధారణ, వృత్తి విద్యా కోర్సులకు వేరువేరుగా పద్దుల కింద నిధులు విడుదల చేయాలని నిర్ణయించి చర్యలు చేపట్టింది. తొలి రెండు మూడు నెలలు నిధుల విడుదల సాఫీగా జరిగినప్పటికీ.. ఆ తర్వాత క్రమం తప్పింది. దీంతో బకాయిలు పేరుకుపోతూ వచ్చాయి. దీంతో రెండేళ్లుగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.  
ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులు
పలు కాలేజీల్లో కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు యాజమాన్యాల ఒత్తిడితో తామే వ్యక్తిగతంగా ఫీజులు చెల్లించి ధ్రువపత్రాలు పొందాల్సి వస్తోంది. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత.. చెల్లించిన ఫీజులను తిరిగి ఇచ్చేస్తామని యాజమాన్యాలు చెబుతున్నాయి. జూనియర్‌ విద్యార్థుల విషయంలోనూ ఇదే విధంగా వ్యవహరిస్తుండటంతో చాలామంది తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేసి ఫీజులు కడుతున్నారు. ఇలా ఫీజులు చెల్లించినవారు సంక్షేమ కార్యాలయాలకు వెళ్లి ఆరా తీస్తే ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలేదనే సమాధానం ఎదురవుతోంది తప్ప ఫలితం ఉండటం లేదు.  వనపర్తి జిల్లా గోపాల్‌పేట హరిజనవాడకు చెందిన లావణ్య అనే బీటెక్‌ రెండో సంవత్సరం విద్యార్థిని కాలేజీ ఫీజులు చెల్లించలేక గతనెల 19న బలవన్మరణానికి పాల్పడటం సంచలనం సృష్టించింది.

దరఖాస్తులు పరిశీలనకే పరిమితం...
2020–21 విద్యా సంవత్సరంలో ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకారవేతనాలకు సంబంధించి 12.85 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తులు సమర్పించారు. గతేడాది ఆగస్టులో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా, ఈ ఏడాది మే నెలాఖరు వరకు ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియ కొనసాగింది. దాదాపుగా నూరు శాతం విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు. దరఖాస్తు ప్రక్రియ మొదలైన నెల రోజుల తర్వాత నుంచి వాటి వెరిఫికేషన్‌ ప్రక్రియ మొదలు కావాలి. అయితే కోవిడ్‌–19 నేపథ్యంలో పరిశీలన ఆలస్యమైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పరిశీలన ప్రారంభించిన సంక్షేమాధికారులు ఇప్పటివరకు 80 శాతం ప్రక్రియ పూర్తి చేశారు. 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకారవేతన పథకాల కోసం రూ.2,250 కోట్లు అవసరమని ప్రాథమికంగా అంచనా వేశారు. అయినా ఇప్పటివరకు అటు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు గానీ, ఉపకార వేతనాలకు కానీ  నిధులు విడుదల కాకపోవడం గమనార్హం. ఇక 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా రూ.767.41 కోట్ల మేర బకాయి ఉంది. వీటికి సంబంధించి సంక్షేమ శాఖ అధికారులు బిల్లులు సిద్ధం చేసినప్పటికీ నిధులు విడుదల కాకపోవడంతో కార్యాలయాల్లోనే మూలుగుతున్నాయి. 

తక్షణమే నిధులు విడుదల చేయాలి
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధుల విషయమై ఆర్థిక మంత్రితో సహా పలువురికి వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేదు. ఇతర పథకాలకు వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. విద్యార్థులకు బకాయి పడ్డ నిధులను ఇవ్వకపోవడం బాధాకరం. ప్రభుత్వం ఇప్పటికైనా యుద్ధప్రాతిపదికన నిధులు విడుదల చేయాలి. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుంది. 
– ఆర్‌.కృష్ణయ్య, అధ్యక్షుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం

దిక్కుతోచని స్థితిలో కాలేజీలు 
ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌పైనే ఆధారపడి ఇంటర్మీడియట్, డిగ్రీ కోర్సులు చదువుతున్న వాళ్లు 85 శాతం ఉన్నారు. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాయి. అప్పులు చేసి బోధన, బోధనేతర సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్నాయి. కొన్ని యాజమాన్యాలు ఏకంగా కాలేజీలనే మూసేస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోకుంటే రాష్ట్రంలో ఉన్నత విద్యా వ్యవస్థ ప్రమాదంలో పడుతుంది. 
– గౌరి సతీష్, కన్వీనర్, తెలంగాణ ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల సంఘం

మరిన్ని వార్తలు