తెలంగాణ.. సక్సెస్‌ఫుల్‌ స్టార్టప్‌

24 Mar, 2022 04:53 IST|Sakshi

అమెరికాలో ‘తెలంగాణలో ఐటీ పెట్టుబడులు’ సదస్సులో కేటీఆర్‌ 

తలసరి ఆదాయం, జీఎస్డీపీలో దూసుకుపోతున్నాం 

రూరల్‌ టెక్‌ పాలసీతో వచ్చే ఐదేళ్లలో 50 వేల ఐటీ ఉద్యోగాలు 

‘మన ఊరు–మన బడి’ ద్వారా మూడేళ్లలో 26 వేల స్కూళ్ల అభివృద్ధి 

సాక్షి, హైదరాబాద్‌: 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం విజయవంతమైన స్టార్టప్‌లా పురోగమిస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. అవమానాలు, అవహేళనలు, అడ్డంకులను పట్టుదల, క్రమశిక్షణతో అధిగమించి తెలంగాణ అద్భుత ప్రస్తానం సాగిస్తోందన్నారు. భారత్‌లో ఎగురుతున్న ఏకైక గెలుపుపతాకం తెలంగాణ మాత్రమేనన్నారు. దేశంలో జనాభా పరంగా 12వ స్థానం, భౌగోళికంగా 11వ స్థానంలో ఉన్న రాష్ట్రం.. తలసారి ఆదాయం, గ్రాస్‌ స్టేట్‌ డొమెస్టిక్‌ ప్రొడక్ట్‌ (జీఎస్డీపీ)లో 130 శాతానికి పైగా వృద్ధి రేటు సాధించిం దని తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థకు చేయూతనిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ 4వ స్థానంలో ఉందన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా మిలిపిటాస్‌లో ఇండియన్‌ కల్చరల్‌ సెంటర్‌లో ప్రవాస భారతీయులు నిర్వహించిన ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’, ‘తెలంగాణలో ఐటీ పెట్టుబడులు’ అనే అంశంపై ఐటీ సర్వ్‌ అలయెన్స్‌ బందం నిర్వహించిన వేర్వేరు సదస్సుల్లో కేటీఆర్‌ ప్రసంగించారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఏడేళ్లలో వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధిని గణాంకాలతో సహా వివరించారు. 

దేశానికి అన్నపూర్ణ తెలంగాణ
పారిశ్రామిక, వ్యవసాయం, అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో సీఎం కేసీఆర్‌ చేస్తున్న కృషితో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధికి చిరునామాగా మారింద ని కేటీఆర్‌ చెప్పారు. ఎన్నో అవాంతరాలు, అడ్డంకు లు ఎదురైనా విద్య, వైద్యం, విద్యుత్, సాగునీరు, తాగునీటి రంగాల్లో ఏడేళ్లలో రాష్ట్రం సాధించిన అభివృద్ధి, చేపట్టిన పథకాలను వివరించారు. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్, హర్యానా, ఏపీ వంటి రాష్ట్రాలను అధిగమించి దేశానికే అన్నపూర్ణగా రాష్ట్రం మా రిందన్నారు. ఆవిష్కరణలు, మౌళిక వసతులు, స మగ్రాభివృద్ధి అంశాలపై దృష్టి కేంద్రీకరించి రాష్ట్రా న్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నామని చెప్పారు. 

మరిన్ని పట్టణాల్లో ఐటీ టవర్లు
రాష్ట్ర ప్రభుత్వ రూరల్‌ టెక్‌ పాలసీలో భాగంగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు ఐటీ రంగాన్ని విస్తరిస్తామని, దీని ద్వారా రాబోయే ఐదేళ్లలో 50 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని కేటీఆర్‌ వెల్లడించారు. ఇప్పటికే వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లో ఐటీ టవర్లు ఏర్పాటు చేశామని, మున్మందు మరిన్ని పట్టణాల్లో నిర్మిస్తామని చెప్పారు. విద్యాయజ్ఞంలో భాగంగా మూడేళ్లలో 26 వేల పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రవాస భారతీయులు విరాళాలతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ‘మన ఊరు.. మన బడి’ ఎన్‌ఆర్‌ఐ పోర్టల్‌ను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి వర్చువల్‌గా కేటీఆర్‌ ప్రారంభించారు. సదస్సుల్లో భారత కాన్సు భహల్‌ జనరల్‌ నాగేంద్ర ప్రసాద్, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ పాల్గొన్నారు. 

వివిధ సంస్థల కేటీఆర్‌ ప్రతినిధులతో భేటీ
కాలిఫోర్నియాలోని నెవార్క్‌ ప్రధాన కేంద్రంగా పనిచేసే లూసిడ్‌ మోటార్స్‌ ప్రతినిధులతో శాన్‌జోస్‌లో మంత్రి కేటీఆర్‌ బుధవారం భేటీ అయ్యారు. లూసిడ్‌ మోటార్స్‌ సీఈవో పీటర్‌ రాలిన్సన్, సీనియర్‌ ఇంజనీరింగ్‌ డైరెక్టర్‌ జేమ్స్‌ హాకిన్స్‌ ఈ భేటీలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో లూసిడ్‌ మోటార్స్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని కేటీఆర్‌ ప్రతిపాదించారు. సెమీకండక్టర్లు, ప్యానెల్స్, సోలార్‌ ఫొటో ఓల్టాయిక్‌ సెల్స్‌కు అవసరమైన మెటీరియల్‌ ఇంజనీరింగ్‌ సొల్యూషన్స్‌ అందించడంలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ‘అప్లైడ్‌ మెటీరియల్స్‌’వైస్‌ ప్రెసిడెంట్‌ ఓమ్‌ నలమాసుతోనూ మంత్రి భేటీ అయ్యారు. తెలంగాణలోని పారిశ్రామిక అనుకూల విధానాలను వివరించడంతో పాటు అప్లైడ్‌ మెటీరియల్స్‌ పరిశోధన, అభివద్ధి కార్యకలాపాలను హైదరాబాద్‌కు విస్తరించాలని కోరారు.  

మరిన్ని వార్తలు