టీఆర్‌ఎస్‌ గూటికి టీటీడీపీ చీఫ్‌ ఎల్‌.రమణ

9 Jul, 2021 03:46 IST|Sakshi

సీఎం కేసీఆర్‌తో భేటీ.. చర్చలు 

రెండు మూడు రోజుల్లో చేరిక! 

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. గురువారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి ప్రగతిభవన్‌కు వెళ్లిన రమణ.. టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు గతంలో టీడీపీలో కలిసి పనిచేసిన రోజులను గుర్తు చేసుకోవడంతోపాటు ఉద్యమం, తర్వాతి రాజకీయ పరిణామాలపై మాట్లాడుకున్నట్టు తెలిసింది. తెలంగాణ ఏర్పాటయ్యాక టీడీపీ ప్రజల్లోకి వెళ్లలేకపోయిందని, రమణ ఎంత కష్టపడినా ఫలితం లేకుండా పోయిందని వారు అభిప్రాయపడ్డట్టు సమాచారం. అయితే సామాజిక తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలను వివరించిన సీఎం కేసీఆర్‌.. ఆ లక్ష్య సాధన కోసం కలిసి పనిచేద్దామని రమణకు ప్రతిపాదించినట్టు తెలిసింది. రమణ రాజకీయ భవిష్యత్తుకు భరోసా ఇవ్వడంతోపాటు ఆయన వెంట వచ్చే వారికి సముచిత అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చినట్టు సమాచారం. ఎల్‌.రమణ టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారని, అనుచరులతో చర్చించి ముహూర్తం నిర్ణయించుకుంటానని చెప్పినట్టు తెలిసింది. త్వరలో జరుగనున్న ఎమ్మెల్యే కోటా శాసనమండలి ఎన్నికల్లో రమణకు ఎమ్మెల్సీగా అవకాశమిస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చినట్టు సమాచారం. రమణ చేరికపై ఆది, సోమవారాల్లో ప్రకటన రానున్నట్టు తెలిసింది. టీటీడీపీ శాసనసభాపక్షం గతంలోనే టీఆర్‌ఎస్‌లో విలీనమైంది. తాజాగా రమణ వెళ్లిపోతుండటంతో తెలంగాణలో ఆ పార్టీ ఉనికి కోల్పోయినట్టేనని నేతలు అంటున్నారు. 

రమణ బాటలో మరికొందరు మాజీలు 
ఎల్‌.రమణ టీఆర్‌ఎస్‌లో చేరుతుండటంతో టీడీపీకి  చెందిన మరికొందరు కూడా టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ప్రయత్నిన్నట్టు తెలిసింది. హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన ఓ మాజీ మంత్రితోపాటు, ఆలేరు ప్రాంతానికి చెందిన ఓ ముఖ్య నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు కూడా టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం.  

కేసీఆర్‌ ఆహ్వానించారు: రమణ 
సీఎం కేసీఆర్‌తో భేటీలో రాష్ట్రంలో అమలవుతున్న కార్యక్రమాలు, సామాజిక తెలంగాణగా తీర్చిదిద్దేందుకు జరుగుతున్న ప్రయత్నాలు, అభివృద్ధి తదితరాలపై చర్చ జరిగింది. 27 ఏళ్లుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను. నేను మంత్రిగా ఉన్నప్పుడు చేనేత పరిశ్రమను ప్రోత్సహించిన తీరును సీఎం కేసీఆర్‌ గుర్తు చేశారు. ఈ రంగంలో మరింత సేవ చేసే అవకాశం ఉందన్నారు. పార్టీలో చేరాలనే కేసీఆర్‌ ఆహ్వానంపై మా మిత్రులతో మాట్లాడి నిర్ణయానికి వస్తా. టీటీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు ఇచ్చిన అవకాశంతోనే ఈ స్థాయికి ఎదిగా. 

ఉద్యమ సహచరుడు: ఎర్రబెల్లి
రమణ నాకు మంచి మిత్రుడు. ఉద్యమ సమయంలో తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు లేఖ ఇవ్వడంలో మేం ప్రముఖ పాత్ర పోషించాం.  తెలంగాణలో టీడీపీకి మనుగడ లేదు.  

మరిన్ని వార్తలు