కొత్త జిల్లాల టీచర్లకు ఉత్తర్వులు

7 Jan, 2022 01:38 IST|Sakshi

వివాదం లేని టీచర్ల జాబితానే ఖరారు  

సాక్షి, హైదరాబాద్‌: జోనల్‌ విధానంలో భాగంగా కొత్త జిల్లాలకు కేటాయించిన ఉపాధ్యాయులకు వారు పనిచేయాల్సిన స్కూళ్లకు సంబంధించి విద్యాశాఖ నుంచి గురువారం ఆదేశాలు జారీ అయ్యాయి. ఇంటిగ్రేటెడ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ పోర్టల్‌ (ఐఎఫ్‌ఎంఎస్‌) ద్వారా జిల్లా యంత్రాగానికి పోస్టుల కేటాయింపు జాబితా పంపించారు. తర్వాత జిల్లా కలెక్టర్ల కార్యాలయం నుంచి సంబంధిత ఉపాధ్యాయులకు పోస్టింగ్‌ ఉత్తర్వులను పంపారు.

అయితే, వివాదం లేని టీచర్ల జాబితానే ఇప్పటివరకూ ఖరారు చేసినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 వేల మంది ఉపాధ్యాయులు సీనియారిటీ ఆధారంగా కొత్త జిల్లాలకు వెళ్లాల్సి వచ్చింది. వీరిలో 8 వేల మంది వివిధ కారణాలతో అభ్యంతరాలు లేవనెత్తారు. ఐదువేల స్పౌస్‌ కేసులున్నాయి. మరో మూడువేల మంది సీనియారిటీ తప్పుగా పడిందని, అనారోగ్యం కారణంగా స్థానికంగా ఉంచాలని తదితర కారణాలతో అప్పీలు చేసుకున్నారు.

వీటన్నింటినీ విద్యాశాఖ అధికారులు గత వారం రోజులుగా పరిశీలించి 3,500 స్పౌస్‌ కేసులను పరిష్కరించినట్లు తెలిసింది. మరో 1,500 మందిలో భార్య లేదా భర్త కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో వారి అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోలేదు. వీటిని ప్రస్తుతం పెండింగ్‌లో ఉంచినట్టు అధికారులు తెలిపారు. అప్పీలు చేసుకున్న వారి విషయంలో అన్ని కోణాల్లో పరిశీలించి, పరిష్కారం దొరకని కొన్ని కేసులను పెండింగ్‌లో ఉంచినట్టు తెలిసింది.

జిల్లాల్లో సబ్జెక్టు పోస్టులకు సరిపడా సమతూకం లేని కారణంగా మరికొన్ని పరిష్కారం కాలేదు. మొత్తం మీద ఎక్కువ మంది టీచర్ల విషయంలో తుది నిర్ణయం తీసుకుని, వారి జాబితాను ఐఎఫ్‌ఎంఎఫ్‌లో పొందుపరిచారు. ప్రస్తుతం వీరికే పోస్టింగులు ఇస్తున్నారు. పోస్టింగ్‌ సమాచారం అందుకున్న టీచర్లు మూడు రోజుల్లో తమకు కేటాయించిన స్కూళ్లలో చేరాల్సి ఉంటుంది.   

మరిన్ని వార్తలు