రోడ్డెక్కిన ఉపాధ్యాయులు 

30 Dec, 2020 08:55 IST|Sakshi
ధర్నాచౌక్‌లో ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులు

రాష్ట్రం నలుమూలల  నుంచి వేలాదిగా తరలివచ్చిన టీచర్లు 

పీఆర్‌సీ అమలు చేయాలని, బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని డిమాండ్‌ 

నినాదాలతో హోరెత్తిన ధర్నాచౌక్, పోలీసుల భారీ బందోబస్తు  

కవాడిగూడ(హైదరాబాద్‌): బోధన చేసే ఉపాధ్యాయలోకం వేదనతో రోడ్డెక్కింది.. రాష్ట్రం నలమూలల నుంచి వేలాదిమంది టీచర్లు కదిలివచ్చారు. నినాదాలతో ధర్నాచౌక్‌ను హోరెత్తించారు. ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి(జాక్టో), ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుఎస్‌పీసీ) ఆధ్వర్యంలో మంగళవారం ఇక్కడ మహాధర్నా నిర్వహించారు. ధర్నా చౌక్‌కు వచ్చే రహదారులపై బైఠాయించారు. పీఆర్‌సీని అమలు చేయాలని, టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపట్టా లని డిమాండ్‌ చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వందలాది మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు.  

పైసా ఖర్చు లేని బదిలీలూ చేపట్టరా: నర్సిరెడ్డి 
ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారాలను మొత్తం తన వద్ద ఉంచు కోకుండా విద్యారంగానికి సంబంధించిన అధికారాలను విద్యాశాఖ మంత్రికి ఇవ్వాలని, తక్షణమే పీఆర్‌సీ, టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి ఒక్క పైసా ఖర్చు లేకుండా చేపట్టే బదిలీలు, పదోన్నతులు సైతం ఎందుకు నిర్వహించడంలేదని ప్రశ్నించారు.   

టీచర్లు పోలీసుస్టేషన్లలోనా? 
మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌ మాట్లాడుతూ.. 3 నెలల్లో ఇస్తామన్న పీఆర్‌సీ 30 నెలలుగా ఎందుకు జాడలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ.. క్లాసు రూం లో ఉండాల్సిన టీచర్లను అరెస్టు చేసి.. పోలీస్‌ స్టేషన్‌లో ఉంచడం సిగ్గుచేటన్నారు. ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ పీఆర్‌సీ లేటుతో టీచర్లకు 18 నెలలుగా ఐఆర్‌ ఇస్తూ ఆదుకుంటున్నారని, మరి తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదని ప్ర శ్నించారు. కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యు డు అజీజ్‌పాషా, సీపీఎం నేత వెంకట్, న్యూడెమోక్రసీ నేతలు పోటు రంగారావు, కె.గోవర్ధన్, ఉపాధ్యాయ సంఘాల నేతలు రవి, కె.రమణ, శ్రీనివాసులు, సదానంద్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఉపాధ్యాయులను అరెస్టు చేయడం దుర్మార్గం: తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ 
సాక్షి, హైదరాబాద్‌: హక్కుల కోసం పోరాడుతున్న ఉపాధ్యాయులను అన్యాయంగా అరెస్టు చేయడాన్ని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె. చక్రధరరావు, హరగోపాల్‌లు తీవ్రంగా ఖండిచారు. మంగళవారం హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుంచి తరలి వస్తున్న ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేయడాన్ని వారు తప్పుబట్టారు. న్యాయమైన డి మాండ్లను ప్రభుత్వం పరిష్కరించకుండా ఉ ద్యమాన్ని అణిచివేసేలా వ్యవహరించడం దారుణమని విమర్శించారు. టీచర్ల పట్ల, విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చర్చలకు పిలిచి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని కోరారు.
 

మరిన్ని వార్తలు