టీచర్ల బదిలీల దరఖాస్తుకు మరికొంత గడువు

31 Jan, 2023 01:17 IST|Sakshi

ఫిబ్రవరి 1 వరకు పొడిగించిన ప్రభుత్వం

అన్నీ పూర్తయ్యాకే ఎస్‌జీటీ స్పౌజ్‌ల బదిలీలు

అవసరమైతే డిప్యూటేషన్‌

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయుల బదిలీల కోసం దరఖాస్తు గడువును పొడిగించారు. వాస్తవానికి ఈ గడువు సోమవారంతో ముగిసింది. అయితే ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థన మేరకు ఫిబ్రవరి 1వ తేదీ వరకు గడువును పెంచారు. షెడ్యూల్‌లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. టీచర్లు దరఖాస్తు చేసిన తర్వాత హెచ్‌ఎంలు.. వాటిని డీఈ వోలకు సమర్పించే మూడు రోజుల కాలపరిమితిని కుదించనున్నారు.

ఈ నెల 28 నుంచి బదిలీల ప్రక్రియ మొదలైనా, తొలి రోజు పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ ఇబ్బందుల వల్ల టీచర్లు తికమక పడ్డారు. కొన్ని ఆప్షన్లు తెరుచుకోలేదు. మరికొన్ని అప్‌గ్రేడ్‌ కాలేదు. మారు మూల ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ సమస్యలూ ఎదురైనట్టు వార్త లు వచ్చాయి. దీంతో దరఖాస్తు గడువును పొడిగించాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. 

ఇప్పటికి 55 వేల మంది
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 55,479 మంది టీచర్లు బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎక్కువగా నల్లగొండ (3,423), రంగారెడ్డి (3,034), నిజామాబాద్‌ (3,247), సంగారెడ్డి (3,042) దరఖాస్తులు అందినట్టు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. అత్యల్పంగా దరఖాస్తులు అందిన జిల్లాల్లో హనుమకొండ (635), జయశంకర్‌ భూపాలపల్లి (500), ములుగు (379) ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 వేల మంది టీచర్లు బదిలీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో 20 వేల వరకూ అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు, సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఎస్‌జీటీ స్పౌజ్‌ల సంగతి ఆఖరునే
వివిధ జిల్లాల్లో పని చేస్తున్న సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ దంపతుల (ఎస్‌జీటీ స్పౌజ్‌లు) బదిలీ విషయాన్ని ఆఖరులో పరిశీలించే వీలుందని అధికారులు చెబుతున్నారు. 317 జీవో కారణంగా వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిన టీచర్లు రెండు వేలకు పైగా ఉన్నారు. వీరిలో 615 మంది స్కూల్‌ అసిస్టెంట్ల బదిలీకి అవకాశం కల్పించారు. కాగా, హెచ్‌ఎంల పదోన్నతి, స్కూల్‌ అసిస్టెంట్ల కౌన్సెలింగ్‌ పూర్తయిన తర్వాత ఎస్‌జీటీల బదిలీల ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. అవసరమైతే డిప్యూటేషన్‌ ఇచ్చైనా సరే వారి ప్రాంతాలకు పంపాలని నిర్ణయించినట్టు ఓ అధికారి తెలిపారు.  

మరిన్ని వార్తలు