విద్యార్థులను కొట్టి.. ఆపై జండూబామ్‌ రాసి

11 Apr, 2022 04:10 IST|Sakshi
పాఠశాల వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులు 

విద్యార్థులపై టీచర్‌ దౌర్జన్యం

ఎలుకలు కొరికినా పట్టించుకునేవారు కరువు

ఆర్‌సీఓకు గోడు వెళ్లబోసుకున్న గురుకుల విద్యార్థులు

హసన్‌పర్తి: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే నిత్యం అసభ్య పదజాలంతో దూషిస్తూ పిల్లల పాలిట విలన్‌గా మారాడు. ప్రతీ దానికి బూతులు తిట్టడమేకాదు.. తమను కొడుతూ.. నొప్పులు తగ్గేందుకు జండూబామ్‌ రాస్తున్నాడంటూ పలువు రు విద్యార్థులు ఆరోపించారు. విచారణ కోసం పాఠశాలకు వచ్చిన అధికారి ఎదుట తమ ఆవేదన ను వెలిబుచ్చారు.

వివరాలిలా ఉన్నాయి.. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం జయగిరిలోని మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాలలో ముద్దలు గా అన్నం.. నీళ్ల చారుతో భోజనం పెడుతున్నారని విద్యార్థులు ఇటీవల ఆందోళన చేపట్టారు. ఆదివారం వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడా రు. అనంతరం పాఠశాల ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు.

ఈ విషయం తెలుసుకున్న పూలే పాఠశాలల రీజనల్‌ కోఆర్డినేటర్‌ (ఆర్‌సీఓ) మనోహర్‌రెడ్డి అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. ఓ టీచర్‌ ఇష్టం వచ్చినట్టుగా దూషిస్తూ కొడుతున్న వైనాన్ని పిల్లలు వివరించారు.  పాఠశాలలో ఎలుకల బెడద ఉందని, సాయి అనే విద్యార్థిని ఎలుకలు కొరకగా ఆస్పత్రికి తీసుకెళ్లమని ఓ ఉపాధ్యాయుడికి చెబితే.. బిర్యాని తినిపించాలని డిమాండ్‌ చేస్తున్నాడని వెల్లడించారు. విషయాలను హెచ్‌ఎంకు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయారు. 

విచారణకు ఆదేశం
విద్యార్థుల మీద దౌర్జన్యం చేస్తున్న ఉపాధ్యాయు డిపై ఆర్‌సీఓ విచారణకు ఆదేశించారు. అవన్నీ వాస్తవమని తేలితే ఉద్యోగం నుంచి తొలగిస్తామని చెప్పారు. 

మరిన్ని వార్తలు