ఛత్తీస్‌గఢ్‌కు మన పాఠాలు!

20 Nov, 2022 02:25 IST|Sakshi

రెండు రాష్ట్రాల మధ్య త్వరలో ఒప్పందం

విద్యాబోధనలో జేఎన్‌టీయూహెచ్‌ కీలక పాత్ర

తొలుత బీబీఏ డేటా అనలిస్ట్‌ కోర్సును ప్రారంభించే యోచనలో ఛత్తీస్‌గఢ్‌

తర్వాత మరిన్ని కోర్సులకూ మన ప్రొఫెసర్ల తోడ్పాటు

రెండు రాష్ట్రాల్లో ఒకే తరహా సిలబస్‌.. ఆన్‌లైన్‌లో తరగతులు

సాక్షి, హైదరాబాద్‌: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు తెలంగాణ ఆచార్యులు బోధించనున్నారు. ఇందుకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య సూత్రప్రాయమైన అంగీకారం కుదిరింది. త్వరలోనే ఈ మేరకు ఒప్పందం కూడా జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. హైదరాబాద్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూహెచ్‌) ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించనుంది.

దీనిపై ఇప్పటికే రెండు రాష్ట్రాలకు చెందిన విశ్వవిద్యాలయాల ప్రతినిధులు పలు దఫాలుగా చర్చించారు. ఉన్నత విద్యలో జేఎన్‌టీయూహెచ్‌ తీసుకొస్తున్న సంస్కరణలు ఛత్తీస్‌గఢ్‌ వర్సిటీలను ఆకర్షించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో తమ రాష్ట్రంలో నెలకొన్న ప్రొఫెసర్ల కొరతను కూడా ఆ రాష్ట్రం పరిగణలోనికి తీసుకుంది. ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందించేందుకు జేఎన్‌టీయూహెచ్‌ని సరైన భాగస్వామిగా ఎంచుకుంది.

ముందుగా బీబీఏ డేటా అనలిస్ట్‌ కోర్సును ప్రారంభించాలని భావిస్తోంది. ఆ తర్వాత మరికొన్ని కోర్సులకు మన రాష్ట్ర అధ్యాపకుల తోడ్పాటు తీసుకునే అవకాశం ఉంది. కోర్సు నిర్వహణ, ఇతర అంశాలపై మరింత లోతుగా చర్చించాల్సి అవసరం ఉందని, ఆ తర్వాత అఖిల భారత సాంకేతిక విశ్వవిద్యాలయంతో పాటు మరికొన్ని సంస్థల అనుమతి తీసుకోవాల్సి ఉందని జేఎన్‌టీయూహెచ్‌ అధికారులు తెలిపారు. 

డిమాండ్‌ దృష్ట్యానే..
బీబీఏ డేటా అనలిస్ట్‌ కోర్సు గత కొంత కాలంగా ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ పెరుగుతోంది. ఈ–కామర్స్‌ వ్యవస్థ బలపడుతున్న నేపథ్యంలో ఈ రంగంలో నిపుణుల అవస రం ఉందని అన్ని సర్వేలు చెబుతున్నాయి. భారత్‌లో డేటా అనలిస్ట్‌ పూర్తి చేసిన విద్యార్థులు అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాల్లో మంచి వేతనాలతో ఉపాధి పొందుతు న్నారు.

మన దేశంలోనూ డేటా అనలిస్టుల కొరత 60 శాతం వరకూ ఉందని ఇటీవల సర్వేలు పేర్కొన్నాయి. దీన్ని దృష్టి లో ఉంచుకుని గత రెండేళ్ళుగా బీబీఏ డేటా అనలిస్ట్‌ కోర్సు ను అంతర్జాతీయ ప్రమాణాలతో జేఎన్‌టీయూహెచ్‌ అభివృద్ధి చేసింది. ఛత్తీస్‌గఢ్‌లోనూ బీబీఏ డేటా అనలిస్ట్‌ కోర్సుకు మంచి డిమాండ్‌ వస్తోంది. అయితే అక్కడ నిష్ణాతులైన అధ్యాపకుల కొరత కారణంగా ఈ కోర్సుకు అన్ని కాలేజీల్లోనూ అనుమతి ఇవ్వలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణతో భాగస్వామ్యానికి ఛత్తీస్‌గఢ్‌ సిద్ధమైంది. 

కోర్సు నిర్వహణ ఎలా?
ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కాలేజీల్లో బీబీఏ అనలిస్ట్‌ కోర్సులో ప్రవేశాల ప్రక్రియను ఆ రాష్ట్రమే నిర్వహిస్తుంది. విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా జేఎన్‌టీయూహెచ్‌కు లాగిన్‌ అవుతారు. ఇక్కడ ఎంపిక చేసిన ప్రొఫెసర్లు ఆన్‌లైన్‌ ద్వారా వారికి బోధన చేస్తారు. దీనికి అనుగుణంగా రెండుచోట్లా ఒకే తరహా సిలబస్‌ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు.

పరీక్షలు కూడా ఆన్‌లైన్‌లోనే చేపట్టినప్పటికీ, మూల్యాంకన విధానం మాత్రం తామే చేపడతామని ఛత్తీస్‌గఢ్‌ అధికారులు అంటున్నారు. దీనిపై భిన్నాభిప్రాయం వ్యక్తమవుతోంది. బోధించే అధ్యాపకులే మూల్యాంకనం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇలావుండగా ఈ కోర్సు నిర్వహణ కారణంగా జేఎన్‌టీయూహెచ్‌కు ఆదాయం పెరిగే అవకాశం ఉందని, అవసరమైతే కోర్సుకు సంబంధించిన సర్టిఫికెట్‌ ఇచ్చే అంశాలపైనా ఆలోచిస్తున్నట్టు జేఎన్‌టీయూహెచ్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

మన అధ్యాపకులకు మంచి గుర్తింపు
ఛత్తీస్‌గఢ్‌ కోరిక మేరకు బీబీఏ డేటా అనలిస్ట్‌ కోర్సుకు అవసరమైన బోధన తోడ్పాటు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. దీనివల్ల మన అధ్యాపకులకు మంచి గుర్తింపు ఉంటుంది. అయితే కోర్సు నిర్వహణపై సమాలోచనలు జరుగుతున్నాయి. అన్ని రకాల అనుమతులు వచ్చిన తర్వాత ప్రారంభించే యోచనలో ఉన్నాం.     
– ప్రొఫెసర్‌ కట్టా నర్సింహారెడ్డి (జేఎన్‌టీయూహెచ్‌ వీసీ)  

మరిన్ని వార్తలు