ఇటు హరితహారం... అటు హననమా?

21 Sep, 2021 01:09 IST|Sakshi

ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం 

రవీంద్రభారతిలో వృక్షాల కొట్టివేతను ఆపాలని ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: ఒకవైపు చెట్లను పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్య క్రమం చేపడుతుండగా.. మరోవైపు రవీంద్రభారతి ఆవరణలో రెండు భారీ వృక్షాలను కొట్టేయడానికి ప్రయత్నించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రోడ్డుకు సమీపంలో లేకపోగా.. ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం లేకుండా కళాభారతి భవనం వెనుక ఉన్న ఈ వృక్షాలను ఎందుకు తొలగించాలని చూస్తున్నారని ప్రశ్నించింది. ఆ రెండు వృక్షాలను కొట్టివేయడాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది.

ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌రావు, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు భారీ వృక్షాలను కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారని, కొట్టేయకుండా చూడాలంటూ తాము వినతిపత్రం ఇచ్చినా స్పందన లేదంటూ అదే ప్రాంత నివాసి, సామాజిక కార్యకర్త డబ్ల్యూ.శివకుమార్‌ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించింది.

కళాభారతి భవనం పశ్చిమ భాగంలో దాదాపు 40 ఏళ్ల వయసున్న 50 ఫీట్లకుపైగా ఎత్తున్న రావిచెట్టు, మలబార్‌ వేప వృక్షాలు ఉన్నాయని, ఈనెల 18న వీటి కొమ్మలను కొట్టేస్తున్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వడ్డేపల్లి రచన తెలిపారు. ఈ మేరకు పిటిషనర్‌ అక్కడ సిబ్బందిని ఆరా తీయగా ఈ రెండు చెట్లను కొట్టేస్తున్నట్లు తెలిపారన్నారు. ‘ఈ వృక్షాలు ప్రజల ప్రాణాలకుగానీ, భవనాలకు గానీ నష్టం కల్గించే పరిస్థితి లేదు. భవనాల మధ్య ఉండటంతో భారీ గాలి వీచినా కూలిపోయే పరిస్థితి లేదు. భారీ వృక్షాల కొమ్మలను కొట్టివేయాలంటే జీహెచ్‌ఎంసీ అనుమతి తీసుకోవాలి. వృక్షాలను పూర్తిగా తొలగించాలంటే అటవీశాఖ అనుమతి తప్పనిసరి. ఎటువంటి అనుమతి లేకుండా వృక్షాలను తొలగిస్తున్నారు. వృక్షాలను తొలగించకుండా ఆదేశించండి’అని న్యాయవాది విజ్ఞప్తి చేశారు. 

మరిన్ని వార్తలు