10 రోజుల్లో అందుబాటులోకి..

7 May, 2022 04:08 IST|Sakshi

గ్రూప్స్‌కు సంబంధించిన పుస్తకాలను ప్రింటింగ్‌ చేయిస్తున్న తెలుగు అకాడమీ 

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్స్‌కు సిద్ధమవుతున్న లక్ష లాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న తెలుగు అకాడమీ పుస్తకాలు మరో 10 రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. పుస్తకాల ప్రిటింగ్‌ కోసం ఎంపిక చేసిన ప్రింటింగ్‌ ప్రెస్‌లకు శుక్రవారం ఈ మేరకు అధికారిక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రావతరణ తర్వాత రూపకల్పన చేసిన పుస్తకాలనే ఈసారీ ప్రింటింగ్‌కు ఇచ్చినట్టు అధికారవర్గాల ద్వారా తెలిసింది.

సిలబస్‌లో మార్పులు చేర్పులేం చేయలేదని, సమయం లేకపోవడం వల్లే ఇలా చేయాల్సి వచ్చిందని అకాడమీ అధికారులు చెబుతున్నారు. గ్రూప్స్‌కు అవసరమైన సబ్జెక్టులతో పాటు బీఎడ్, ఇతర పుస్తకాలను ప్రింట్‌ చేయిస్తున్నారు. మొత్తం 45 రకాల పుస్తకాలను తెలుగు, ఇంగ్లిష్‌ మాధ్యమాల్లో ప్రచురించబోతున్నారు. ఈ పుస్తకాలను ప్రింట్‌ చేయించాలని 2 నెలల క్రితమే నిర్ణయం తీసుకున్నా పేపర్‌ కొరత, అకాడమీలో నిధుల గోల్‌మాల్‌ వ్యవహారంతో ముద్రణ ప్రక్రియ ముందుకు సాగలేదు.

ఈలోగా గ్రూప్స్‌ నోటిఫికేషన్‌ విడుదలవ్వడంతో అభ్యర్థుల నుంచి డిమాండ్‌ పెరిగింది. పోటీ పరీక్షల  మెటీరియల్‌కు తెలుగు అకాడమీ పుస్తకాలను అన్నివర్గాలు విశ్వసిస్తాయి. అయితే సరైన సమయంలో పుస్తకాలపై అకాడమీ దృష్టి పెట్టకపోవడం విమర్శలకు దారి తీసింది. అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో పుస్తకాల ముద్రణ చేపట్టింది.  

ముద్రణకు ఇచ్చిన పుస్తకాలు ఇవీ 
ఆర్థికాభివృద్ధి, పర్యావరణం, భారత రాజ్యాంగం, తెలంగాణ ఉద్యమం రాష్ట్ర అవతరణ, విపత్తు నిర్వహణ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, సామాజిక నిర్మితి–వివాదాలు–విధానాలు, తెలంగాణ ప్రాచీన చరిత్ర (ముంగిలి), భారత స్వాతంత్రోద్యమ చరిత్ర–3, భారత ప్రభుత్వం రాజకీయాలు–2, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ప్రశ్నల నిధి చరిత్ర, భారత దేశ చరిత్ర–సంస్కృతి, తెలంగాణ భౌగోళిక పరిస్థితులు, జనరల్‌ స్టడీస్, భారత ఆర్థిక వ్యవస్థ, పర్యావరణ అధ్యయనం, అంతర్జాతీయ సంబంధాలు వంటి పుస్తకాలతో పాటు మరికొన్నింటిని అకాడమీ ముద్రణకు పంపింది.    

మరిన్ని వార్తలు