ఆ అభ్యర్థులకు నిరాశ! టెట్‌లో ప్రత్యేక పేపర్‌ లేనట్టే...

18 Apr, 2022 08:34 IST|Sakshi

అన్ని సబ్జెక్టులతోనూ సిలబస్‌ 

ఆందోళనలో 30 వేల మంది  భాషా పండితులు 

టెట్‌ దరఖాస్తుల పరిశీలన నేటి నుంచి... 

సాక్షి, హైదరాబాద్‌: భాషాపండితులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ప్రత్యేకంగా నిర్వహించే ఆలోచనేమీలేదని అధికారవర్గాలు స్పష్టమైన సంకేతాలిచ్చాయి. దీంతో రాష్ట్రంలోని దాదాపు 30 వేల మంది భాషాపండితులు నిరాశకు గురయ్యారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఈ అవకాశం కల్పించారని వారు రాష్ట్రప్రభుత్వం దృష్టికి తెచ్చినా ఎలాంటి సానుకూల స్పందనరాలేదు.

విజ్ఞప్తులు, విన్నపాలు కొనసాగుతున్న క్రమంలోనే టెట్‌ దరఖాస్తు గడువు ఈ నెల 12తో ముగిసింది. మొత్తం 6,29,352 దరఖాస్తులు అందాయని, ఇందులో పేపర్‌–1 రాసేవారి సంఖ్య 3,51,468, పేపర్‌–2 రాసేవారి సంఖ్య 2,77,884 ఉందని అధికారులు తెలిపారు. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ సోమవారం ప్రారంభించే వీలుందని అధికారవర్గాలు పేర్కొన్నాయి. జూన్‌ 12న రాష్ట్రవ్యాప్తంగా టెట్‌ జరుగుతుంది. తమకు తెలియని సిలబస్‌తో టెట్‌ రాయడం కష్టమనే భావనలో భాషా పండితులున్నారు. హిందీ, తెలుగు భాషాపండిట్‌ కోర్సు పూర్తి చేసిన ఈ అభ్యర్థులు టెట్‌ పేపర్‌–2 రాసేందుకు అర్హులు.
(చదవండి: బొడ్రాయి ప్రతిష్టాపన @ 5 కోట్లు!)

అయితే, వీరు ప్రధానంగా సంబంధిత భాషపైనే శిక్షణపొంది ఉంటారు. 60 శాతం భాషాపరమైన సిలబస్‌ నుంచి పరీక్ష నిర్వహిస్తే టెట్‌లో పోటీ పడగలమని వీరు చెబుతున్నారు. కానీ, ప్రస్తుతం గణితం, సైన్స్‌సహా మిగతా సిలబస్‌తో వీళ్లు టెట్‌ రాయాల్సి వస్తోంది. ఇది తమకు ఇబ్బందిగానే ఉంటుందని వారి వాదన. రాష్ట్రంలో ప్రస్తుతం 20 వేల మంది తెలుగు పండిట్‌లు, 10 వేల మంది హిందీ పండితులున్నారు. 

ఆన్‌లైన్‌ అవస్థలు.. 
టెట్‌ దరఖాస్తుల సమయంలో అనేక సమస్యలు ఎదురైనట్టు అభ్యర్థులు చెబుతున్నారు. దరఖాస్తుపై కొంతమంది ఫొటోలు ఆప్‌లోడ్‌ అయినా, సంతకాలు నిర్దేశిత ప్రాంతంలో పొందుపర్చలేకపోయామని, సాంకేతిక ఇబ్బందులే దీనికి కారణమని చెబుతున్నారు. సమీపంలోని పరీక్ష కేంద్రాలు ఆన్‌లైన్‌లో చూపించలేదని ఎల్‌బీనగర్‌కు చెందిన చైతన్య, రఘురాం అనే అభ్యర్థులు తెలిపారు. అయితే, దరఖాస్తులు తాము చెప్పిన రీతిలో లేని పక్షంలో తిరస్కరిస్తామని అధికారులు అంటున్నారు. దీంతో పలువురు అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. 

ఏపీ తరహాలో పేపర్‌–3 ఉండాలి
భాషాపండితులకు 2018లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పేపర్‌–3 నిర్వహించింది. అదే తరహాలో ఇక్కడా భాషపైనే ఎక్కువ సిలబస్‌తో ప్రశ్నలు ఉండాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలా అయితేనే 30 వేల భాషాపండితులకు ప్రభుత్వం న్యాయం చేయగలుగుతుంది. కానీ, దీన్ని పట్టించుకోకపోవడంతో ఆశలన్నీ అడియాసలయ్యాయి.   
– సి.జగదీశ్‌ (రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు, రాష్ట్ర అధ్యక్షుడు)  
(చదవండి: టెట్‌ పరీక్ష కేంద్రాలు బ్లాక్‌)

మరిన్ని వార్తలు