పాస్‌పోర్టు.. నెలలకొద్దీ లేటు!

12 Jun, 2022 02:41 IST|Sakshi

స్లాట్ల కోసమే నెలన్నర దాకా వెయిటింగ్‌.. చేతికి అందేందుకు 2–3 నెలలకుపైగా సమయం

కోవిడ్‌ సమయంలో దరఖాస్తులు రాకపోవడమే కారణం 

ఇప్పుడు భారీగా కొత్త పాస్‌పోర్టులు, రెన్యూవల్‌ కోసం అప్లికేషన్లు 

పాస్‌పోర్టు కార్యాలయంలో సిబ్బంది కొరత కూడా జాప్యానికి కారణం.. 

పెండింగ్‌లోనే వేల కొద్దీ దరఖాస్తులు.. తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఉద్యోగులు, విద్యార్థులు 

కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లే వారికీ తప్పని సమస్యలు

సాక్షి, హైదరాబాద్‌: ఏదో అత్యవసరమై విదేశాలకు వెళ్లాలి.. అందుకు పాస్‌పోర్టు కావాలి.. దరఖాస్తు చేసుకుందామనుకుంటే నెలా నెలన్నర దాకా స్లాట్‌కే దిక్కులేదు. స్లాట్‌ దొరికి పాస్‌పోర్టు కేంద్రంలో హాజరైనా.. ప్రక్రియ ముగిసి పాస్‌పోర్టు చేతికి వచ్చేదాకా మరింత ఆలస్యం. కరోనా సమయంలో ఇండియాకు తిరిగి వచ్చిన ఉద్యోగులు, విదేశాల్లో చదువుకోసం వెళ్లాల్సిన విద్యార్థులు, తమ కుటుంబ సభ్యులను చూసుకునేందుకు వెళదామనుకున్నవారు.. ఇలా ఎందరో దీనివల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

సమయం చిక్కిందికదా అని విహారయాత్రకు వెళ్దామనుకునే వారికి కూడా వీసాలు దొరికినా.. పాస్‌పోర్టు కోసం స్లాట్లు దొరకని పరిస్థితి. కోవిడ్‌ సమయంలో దాదాపు ఏడాదిన్నర పాటు పాస్‌పోర్టు కోసం పెద్దగా దరఖాస్తులు రాలేదని.. ఇప్పుడు పరిస్థితి చక్కబడటంతో భారీగా దరఖాస్తు చేసుకుంటుండటమే ఇబ్బందికి కారణమని రీజనల్‌ పాస్‌పోర్టు కార్యాలయవర్గాలు చెప్తున్నాయి. 

తత్కాల్‌ నెల.. సాధారణం నెలన్నర.. 
ఉమ్మడి రాష్ట్రంలో పాస్‌పోర్టు కోసం రెండు, మూడు నెలలు ఎదురుచూడాల్సి వచ్చేది. తెలంగాణ ఏర్పాటయ్యాక వారం, పదిరోజుల్లో పాస్‌పోర్టు చేతికి అందింది. కానీ మళ్లీ ఇప్పుడు పరిస్థితి మొదటికి వచ్చింది. అసలు పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసి, స్లాట్‌ కోసమే నెలా నెలన్నర రోజులు వేచి చూడాల్సి వస్తోంది. ఇప్పుడు సాధారణ పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకుంటే.. జూలై చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో స్లాట్‌ కేటాయిస్తున్నారు.

దీనివల్ల సాధారణ పాస్‌పోర్టు దరఖాస్తుదారులు అనుకున్న సమయంలో వెళ్లాల్సిన ప్రదేశాలకు, హాజరుకావాల్సిన కార్యక్రమాలకు పోలేక ఇబ్బంది పడుతున్నారు. ఇక తత్కాల్‌ విధానంలో, రెన్యువల్‌ కోటా కింద పాస్‌పోర్టుకు దరఖాస్తు చేస్తే.. నెల రోజుల తర్వాత స్లాట్‌ కేటాయిస్తున్నారు. దీనివల్ల వీసా ఉండి ఉద్యోగాల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం విదేశాలకు వెళ్లాల్సినవాళ్లు ఇబ్బందిపడుతున్నారు. అత్యవసరంగా కావాల్సినవారు నానా ఇబ్బందులు పడి ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లు, ఎంపీలు, మంత్రులు, ఇతర వీవీఐల సిఫార్సు లేఖల ద్వారా వారం, పదిరోజుల్లో పాస్‌పోర్టు స్లాట్‌ను పొందగలుతున్నారు. 

కరోనా ప్రభావంతోనే..! 
పాస్‌పోర్టు స్లాట్‌ కేటాయింపుల సమయం నెలన్నర వరకు ఉండటానికి ప్రధాన కారణం కరోనా ప్రభావమేనని పాస్‌పోర్టు కార్యాలయ వర్గాలు చెప్తున్నాయి. రెండేళ్ల పాటు కరోనా ప్రభావం వల్ల దరఖాస్తులు పెద్దగా రాలేదని.. రెన్యువల్‌ కోసమూ దరఖాస్తులు అందలేదని అంటున్నాయి. ఇప్పుడు ఒక్కసారిగా అంతా దరఖాస్తు చేసుకుంటుండటంతో రద్దీ పెరిగిందని, రోజూ వందల స్లాట్లు ఇస్తున్నా సరిపోవడం లేదని పేర్కొంటున్నాయి.

కరోనా తగ్గుముఖం పట్టడం, విదేశాలు మళ్లీ గేట్లు ఓపెన్‌ చేయడంతో ఒకేసారి రద్దీ పెరిగిందని వెల్లడిస్తున్నాయి. పాస్‌పోర్టు సేవా కేంద్రాల వారీగా ప్రతిరోజు కేటాయిస్తున్న స్లాట్లు సరిపోవడం లేదని పాస్‌పోర్టు ఆఫీస్‌ వర్గాలు వెల్లడించాయి. ఆయా సేవా కేంద్రాల వారీగా స్లాట్ల వివరాలు పరిశీలిస్తే.. 

రెండు రోజుల్లో ఎస్బీ విచారణ 
గతంలో పాస్‌పోర్టు జారీకి సంబంధించి పోలీసుశాఖ స్పెషల్‌ బ్రాంచ్‌ విచారణ ప్రక్రియ ఆలస్యమయ్యేది. కానీ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎస్బీ విచారణ రెండు, మూడు రోజుల్లోనే పూర్తవుతోంది. వారం, పది రోజుల్లోగా దరఖాస్తుదారుడి చేతికి పాస్‌పోర్టు అందేది. ఇప్పుడు కూడా ఎస్బీ విచారణ త్వరగా పూర్తవుతున్నా.. పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో సిబ్బంది కొరతతో ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. అరకొర సిబ్బందితో పెద్ద సంఖ్యలో దరఖాస్తులను క్లియర్‌ చేయడం కష్టమవుతోందని, సిబ్బంది సంఖ్య పెరిగితే త్వరగా ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు చెప్తున్నారు. 

ఫోన్లు పనిచేయడమే లేదు.. 
పాస్‌పోర్టు జారీ ప్రక్రియలో సమస్యలు, కారణాలపై వివరణ కోరేందుకు ‘సాక్షి’ప్రతినిధులు రీజనల్‌ పాస్‌పోర్టు అధికారి (ఆర్పీవో)ను సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. రీజనల్‌ పాస్‌పోర్టు కార్యాలయ వెబ్‌సైట్‌లో ఉన్న రెండు ల్యాండ్‌ లైన్‌ నంబర్లలో సంప్రదించే ప్రయత్నం చేసినా.. ఆ నంబర్లు పనిచేయడం లేదని సమాధానం వచ్చింది. దరఖాస్తుదారులు కూడా ఈ తీరుతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

రెన్యువల్‌ కోసం నెల నుంచి ప్రయత్నిస్తున్నా.. 
నేను యూఎస్‌ వెళ్లాల్సి ఉంది. నాకు వీసా ఉంది. కానీ పాస్‌పోర్టు వ్యాలిడిటీ జూలైతో ముగుస్తోంది. ట్రావెల్‌ చేయాలంటే పాస్‌పోర్టు వ్యాలిడిటీ ఆరు నెలలకు తక్కువ కాకుండా ఉండాలి. రెన్యూవల్‌ కోసం ఏప్రిల్‌ తొలివారంలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశాను. జూన్‌ñ మధ్యవారంలో స్లాట్‌ ఇచ్చారు. స్లాట్‌ కోసమే రెండున్నర నెలలు వెయిట్‌ చేయాల్సి వచ్చింది. 
– మహ్మద్‌ అబ్దుల్, హైదరాబాద్‌ 

కరోనా సమయంలో వచ్చా.. వెళ్లాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి.. 
నేను కరోనా సమయంలో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకునేందుకు అమెరికా నుంచి వచ్చాను. వర్క్‌ ఫ్రం హోం అవకాశం ఉండటంతో ఇక్కడే ఉన్నాను. ఇప్పుడు మళ్లీ వెళ్లాలి. పాస్‌పోర్టు రెన్యూవల్‌ చేసుకోవాల్సి ఉంది. తత్కాల్‌లో రెన్యూవల్‌కు మే మొదటి వారంలో దరఖాస్తు చేశా.. జూలై మొదటి వారంలో స్లాట్‌ ఇచ్చారు. నేను ఈ నెలలోనే వెళ్లాల్సి ఉంది. 
– సత్య, ఈసీఐఎల్, హైదరాబాద్‌   

మరిన్ని వార్తలు