నేడే ‘దళిత, గిరిజన దండోరా మహాసభ’

18 Aug, 2021 01:23 IST|Sakshi
రావిర్యాలలో సభాస్థలి మార్గాల్లో ఏర్పాటు చేసిన కటౌట్లు

టీఆర్‌ఎస్‌ మోసాలను ఎండగట్టేందుకే సభ: రేవంత్‌రెడ్డి 

సాక్షి, రంగారెడ్డి జిల్లా/హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత, గిరిజన దండోరా మహాసభను విజయవంతం చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సర్వం సిద్ధం చేశాయి. ఇప్పటికే మహేశ్వరం మండలం రావిర్యాలలో భారీ సెట్టింగ్‌లతో సభావేదికను ఏర్పాటు చేశాయి. ఆ మేరకు జనసమీకరణ చేసి సభను విజయవంతం చేయడంతోపాటు క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి ఉన్న బలాన్ని మరోసారి చాటేందుకు ఆయా విభాగాల ఇన్‌చార్జీలు సర్వశక్తులొడ్డుతున్నారు. మండలాల వారీగా ఇన్‌చార్జీల ను నియమించి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. సభాస్థలి వద్ద మూడు వేదికలు ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై ముఖ్యమైన నేతలు కూర్చొనే విధంగా, రెండో వేదికపై మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, పార్టీ సీనియర్‌ నాయకులకు కేటాయించారు.

12 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం ప్రధాన మార్గం సహా దాని చుట్టూ సోనియా, రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డిల భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. సభాస్థలికి చేరుకునే మార్గాల్లో కటౌట్లతోపాటు పార్టీ జెండాలను నెలకొల్పారు. మహాసభను విజయవంతం చేయాలని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి కోరారు. టీఆర్‌ఎస్‌ ఏడున్నరేళ్ల పాలనలో దళిత, గిరిజన వర్గాలకు జరిగిన అన్యాయాన్ని, మోసాన్ని ఎండగట్టి ప్రజల్లో చైతన్యం నింపేందుకే సభను నిర్వహిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. నిజానికి, ఇబ్రహీంపట్నంలో సభను నిర్వహించనున్నట్లు రేవంత్‌రెడ్డి ఇటీవల ప్రకటించడం, దీనిపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభ్యంతరం చెప్పడంతో సభాస్థలిని రావిర్యాలకు మార్చిన విషయం తెలిసిందే. ఈ దండోరాకు భారీగా నేతలు, కార్యకర్తలు వచ్చే అవకాశం ఉండటంతో వారి వాహనాలను సభాస్థలికి కిలోమీటర్‌ దూరంలోనే పార్కింగ్‌ చేసేలా ఏర్పాట్లు చేశారు.

మరిన్ని వార్తలు