కృష్ణా జలాల వివాదం తెలుగు రాష్ట్రాలకే పరిమితం

27 Aug, 2021 02:51 IST|Sakshi

సుప్రీంకోర్టులో తెలంగాణ అనుబంధ అఫిడవిట్‌ 

కర్ణాటక, మహారాష్ట్రలను ఇందులోకి లాగబోము 

ప్రతివాదులుగా ఆ రాష్ట్రాలను తొలగించండి 

కేసు ఉపసంహరణ పిటిషన్‌పై నేడు విచారణ 

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా నదీ జలాల వివాదం రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితమై ఉంటుందని సుప్రీంకోర్టుకు తెలంగాణ తెలిపింది. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం సెక్షన్‌–3 కింద వేసే ట్రిబ్యునల్‌ కూడా తెలంగాణ, ఏపీలకే పరిమితమై ఉంటుందని పేర్కొంది. బేసిన్‌లోని ఇతర రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలను ఇందులోకి లాగబోమని స్పష్టం చేసింది. సెక్షన్‌–3 కింద కృష్ణా జలాల పునఃపంపిణీ అంశాన్ని సైతం తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయాలని కోరింది. ఈ మేరకు రెండురోజుల క్రితం అనుబంధ అఫిడవిట్‌ దాఖలు చేసింది.  

811 టీఎంసీల నీటినే పునఃపంపిణీ చేయండి 
కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు న్యాయం జరిగేలా అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం–1956 సెక్షన్‌–3 ప్రకారం ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలని.. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన అపెక్స్‌ భేటీలో సీఎం కేసీఆర్‌ కోరారు. అయితే సుప్రీంకోర్టులో కేసు కారణంగా తాము ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయలేకపోతున్నామని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ తెలిపారు. తెలంగాణ గనుక కేసును ఉపసంహరించుకుంటే తాము త్వరగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు సుప్రీంకోర్టులో కేసును విరమించుకునేలా తెలంగాణ ప్రభుత్వం రిట్‌ దాఖలు చేసింది.

ఈ రిట్‌పై గడిచిన నెల రోజులుగా వాదనలు జరుగుతున్నాయి. అయితే 2015లో తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్‌లో కర్ణాటక, మహారాష్ట్రలు ప్రతివాదులుగా ఉన్నాయి. దీంతో ఈ రెండు రాష్ట్రాలు ఆ పిటిషన్‌లో ఇంప్లీడ్‌ అయ్యాయి. తెలంగాణ పిటిషన్‌పై తమ అభిప్రాయాలు అఫిడవిట్‌ రూపంలో తెలియజేస్తామని గత విచారణల సందర్భంగా కోర్టుకు తెలిపాయి. ఈ కేసు తాజాగా ఈ నెల 27న విచారణకు రానుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ అనుబంధ అఫిడవిట్‌ దాఖలు చేసింది. ప్రతివాదులుగా కర్ణాటక, మహారాష్ట్రలను తొలగించాలని అందులో కోరింది. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి పంపిణీ చేసిన 811 టీఎంసీల నీటిని మాత్రమే తెలుగు రాష్ట్రాలకు పునఃపంపిణీ చేయాలని విన్నవించింది. కర్ణాటక, మహారాష్ట్రలకు ఇదివరకే కేటాయించిన నీటి విషయం జోలికి తాము వెళ్లబోమని తెలిపింది.    

మరిన్ని వార్తలు