కాళేశ్వరంలో పడవ ప్రయాణం

24 Jan, 2021 14:41 IST|Sakshi

కాళేశ్వరం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం వద్ద గోదావరిలో తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో అధునాతమైన బోటు అందుబాటులోకి రానుంది. ఈ బోట్‌ను రూ.2 కోట్ల వ్యయంతో సిద్ధం చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో మహదేవపూర్‌ మండలం మేడిగడ్డలోని లక్ష్మీ బ్యారేజీ నుంచి కాలేశ్వరం వరకు 22 కిలోమీటర్ల దూరం బ్యాక్‌ వాటర్‌ నిల్వ ఉంటోంది. దీంతో ఇక్కడ గోదావరి సముద్రాన్ని తలపిస్తోంది. ఆ నీటి ఉధృతిలో అతిపెద్ద బోటు ఏర్పాటు చేస్తే టూరిస్టులను ఆకర్షించవచ్చనే ఉద్దేశంతో పర్యాటక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

మూడు నెలల్లో అందుబాటులోకి..
ఫిబ్రవరి మొదటి వారం నుంచి కాళేశ్వరంలోని గోదావరి తీరంవద్దే 300 మంది కూలీలతో బోటును తయారు చేయించనున్నారు. ఇందుకోసం ఏపీ నుంచి కార్మికులను రప్పించే ప్రయత్నాల్లో అధికారులు ఉన్నట్లు సమాచారం. అధునాతన పరిజ్ఞానంతో సిద్ధం చేయించనున్న ఈ బోట్‌లో ఏసీ, నాన్‌ ఏసీ గదులు ఉంటాయని తెలిసింది. వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి పర్యాటకులు వచ్చే అవకాశం ఉండడంతో  పర్యాటక శాఖ ఆ వైపుగా దృష్టి సారించింది. బోట్‌ సిదమయ్యాక కాళేశ్వరం నుంచి లక్ష్మీ బ్యారేజ్‌ వరకు ప్రయాణం చేసేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాదారం. మూడు నెలల్లో బోట్‌ అందుబాటులోకి వచ్చే అవకాశముందని టూరిజం శాఖ ఉద్యోగులు తెలిపారు. చిన్నచిన్న వేడుకలతో పాటు విందులు చేసుకునేలా 200 మంది ప్రాణం చేసేందుకు వీలుగా బోట్‌ ఉంటుంది. బోటు కాళేశ్వరంలో తిరగడం ఆరంభిస్తే ఇప్పటికే ప్రాజెక్టును సందర్శించేందుకు వస్తున్న పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు