బిజీ లైఫ్ నుంచి రిలీఫ్ ‍కావాలా? చలో పోచారం.. ప్రకృతి ఒడిలో హాయిగా సేద తీరండి..

18 Apr, 2023 08:58 IST|Sakshi

ఎటుచూసినా భవనాలు... రోడ్లు.. వాహనాల రణగొణ ధ్వనులు.. ఉక్కిరిబిక్కిరి చేసే వాయుకాలుష్యం... ఉరుకుల పరుగుల జీవనం.. ఇదీ నేటి కాంక్రీట్‌ జంగిల్‌లా మారిన పట్టణ, నగరవాసుల దయనీయ పరిస్థితి. దీన్నుంచి కాస్త ఉపశమనం పొందాలనుకుంటున్నారా? ఎటుచూసినా పచ్చటి చెట్లు.. పక్షుల కిలకిలారావాలు... అక్కడక్కడా కనిపిస్తూ కనువిందు చేసే వన్యప్రాణులు, స్వచ్ఛమైన పిల్లగాలులు, ప్రకృతి సోయగాల నడుమ సూర్యోదయ, అస్తమయాలను కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి ఆస్వాదించాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం.. చలో నర్సాపూర్, పోచారం. 

సాక్షి, హైదరాబాద్‌: ప్రకృతి ఒడిలో నగరవాసులు కాసేపు సేదతీరేందుకు వీలుగా మెదక్‌ అటవీ శాఖ, యునైటెడ్‌ స్టేట్స్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ (యూఎస్‌ఏఐడీ) సంయుక్తంగా ‘కమ్యూనిటీ బేస్డ్‌ ఎకో టూరిజం’నేచర్‌ క్యాంప్‌లను అందుబాటులోకి తెచ్చాయి. నర్సాపూర్‌ అటవీ ప్రాంతం, పోచారం వైల్డ్‌లైఫ్‌ శాంక్చురీ, జీప్‌ సఫారీ, ట్రెక్కింగ్‌ తదితరాలతో రెండు పగళ్లు, ఒక రాత్రి కలిపి మొత్తం 36 గంటలపాటు అడవిలో గడుపుతూ మధుర అనుభూతులను సొంతం చేసుకొనేలా ప్యాకేజీని సిద్ధం చేశాయి.

పర్యాటకులు అడవుల్లోని చెట్లు, జంతువుల రకాలు, పర్యావరణ వ్యవస్థలు, స్థానిక ఆహారపు అలవాట్లు, గిరిజనుల సాంస్కృతిక జీవనం, వ్యవసాయ పద్ధతుల వంటి వాటిని ప్రత్యక్షంగా తెలుసుకోవడాన్ని ఇందులో అంతర్భాగం చేశాయి. స్థానికంగా తయారు చేసిన వస్తువులకు గిరాకీ కలి్పంచడం ద్వారా స్వయం ఉపాధి అవకాశాల పెంపుతోపాటు పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించనున్నాయి. 

నేచర్‌ క్యాంప్‌ టూర్‌ ఇలా..
♦ ఉదయం 6 గంటలకు నర్సాపూర్‌ అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కు నుంచి ప్రారంభం 
♦ ఈ పార్కులో ట్రెక్కింగ్, బర్డింగ్, బట్టర్‌ఫ్లై వాక్, వెట్‌ల్యాండ్‌ విజిట్‌ 
♦ వాచ్‌టవర్‌ వద్ద అల్పాహారం. అక్కడే ఈ టూర్‌కు సంబంధించిన ఇంటరాక్షన్‌ 
♦ నర్సాపూర్‌ పార్క్‌కు ఎదురుగానున్న అటవీప్రాంతం సందర్శన, అక్కడ నుంచి నర్సాపూర్‌ పట్టణానికి పయనం. 
♦ మెదక్‌ పట్టణానికి ప్రయాణ మార్గమధ్యంలో ఫారెస్ట్, ప్రైవేట్‌ నర్సరీల విజిట్‌. మెదక్‌ చర్చి సందర్శన, ఆ తర్వాత సమీపంలోనే లంచ్‌ 
♦ అక్కడి నుంచి పోచారం వైల్డ్‌లైఫ్‌ శాంక్చురీకి.. 
♦ స్థానిక పర్యావరణ వ్యవస్థలపై అవగాహన పెంచుకునేందుకు సిద్ధం చేసిన ఎని్వరాన్‌మెంట్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌ (ఈఈసీ) విజిట్‌ 
♦ వైల్డ్‌లైఫ్‌ సఫారీ, పోచారం డ్యామ్, నిజాం హెరిటేజ్‌ బిల్డింగ్స్‌ సందర్శన, సూర్యాస్తమయ వీక్షణ. 
♦ ఈఈసీ సెంటర్‌ వద్ద సమావేశం. అక్కడే స్థానిక వంటకాలు, రుచులతో బార్బిక్యూ డిన్నర్, హోమ్‌స్టే లేదా టెంట్లలో రాత్రి నిద్ర. 
♦ మరుసటి రోజు ఉదయం 6 గంటలకు పోచారం లేక్‌ వద్ద సూర్యోదయ వీక్షణ 
♦ అల్పాహారం తర్వాత పోచారం వైల్డ్‌లైఫ్‌ 
♦ శాంక్చురీలో బర్డ్‌ వాచింగ్, బట్టర్‌ఫ్లై వాక్‌ 
♦ ఉదయం 11 గంటలకు దంతేపల్లి లేదా మరోచోట గిరిజన గ్రామ సందర్శన 
♦ మధ్యాహ్నం దంతేపల్లిలో ‘ఫామ్‌ లంచ్‌’
♦ అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం 

పోచారం వైల్డ్‌లైఫ్‌ శాంక్చురీ ప్రత్యేకతలివే... 
హైదరాబాద్‌కు 115 కి.మీ. దూరంలోని పోచారం వైల్డ్‌లైఫ్‌ శాంక్చురీ 130 చ.కి.మీ. విస్తీర్ణంలో మెదక్, కామారెడ్డి జిల్లాల పరిధిలో విస్తరించింది. ఇది పోచారం లేక్‌ వెంట విస్తరించి ఉండటం విశేషం. ఇక్కడ వివిధ రకాల జింకలు, చిరుతలు, ఎలుగుబంట్లు కూడా కనిపిస్తుంటాయి. పలు రకాల అరుదైన పక్షులకు సైతం ఇది కేంద్రంగా ఉంది. 

ఫారెస్ట్‌ ప్లస్‌ 2.0 అంటే... 
కేంద్ర అటవీ, పర్యావరణశాఖల సహకారంతో యూఎస్‌ఏఐడీ సంస్థ ప్రకృతిసిద్ధ పరిష్కారాల అభివృద్ధి ద్వారా అడవులపై ఆధారపడిన స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు పెంపొందించడంతోపాటు కమ్యూనిటీల పరంగా బలోపేతం కావడానికి వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. దీనికి ఫారెస్ట్‌ ప్లస్‌ 2.0గా నామకరణం చేసింది. ఇందులో భాగంగా తిరువనంతపురం (కేరళ), గయ (బిహార్‌), మెదక్‌ (తెలంగాణ)లో కమ్యూనిటీ బేస్డ్‌ ఎకో టూరిజం నేచర్‌ క్యాంపులకు శ్రీకారం చుట్టింది.

కనీసం 20 మంది.. సొంత వాహనాల్లో వస్తేనే..
పర్యాటకులకు ప్రత్యక్షంగా ప్రకృతిని, వైల్డ్‌ లైఫ్‌ను అనుభవంలోకి తీసుకొచ్చేందుకు ఈ ప్రోగ్రామ్‌ను  రూపొందించాం. ప్రజలకు అడవులు, పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను తెలియజేసేందుకు ఈ క్యాంప్‌లకు ప్రాధాన్యతనిచ్చాం. నేచర్‌ క్యాంప్‌ల ద్వారా వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నాం. కనీసం 20 మందితో కూడిన పర్యాటక బృందం ఈ క్యాంప్‌కు రావాల్సి ఉంటుంది. సొంత వాహనాల్లోనే వారు మొత్తం టూర్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. పిల్లలకు (పదేళ్లు పైబడిన వారే) రూ. 1,500, పెద్దలకు రూ. 2 వేలు చొప్పున చార్జీగా ఖరారు చేశాం. ఆహారం, ఎంట్రీ ఫీజు, సఫారీ తదితరాలన్నీ ఈ ప్యాకేజీలో ఉంటాయి.
– జి. సాయిలు, రీజినల్‌ డైరెక్టర్, ఫారెస్ట్‌–ప్లస్‌ 2.0
చదవండి: తెలంగాణ పంచాయతీలకు అవార్డుల పంట

మరిన్ని వార్తలు