‘డిఫెన్స్‌’లో చర్చిస్తాం.. పార్లమెంట్‌లో నిలదీస్తాం 

19 Jun, 2022 01:29 IST|Sakshi
గాంధీ ఆసుపత్రిలో క్షతగాత్రుడిని పరామర్శిస్తున్న రేవంత్‌రెడ్డి

‘అగ్నిపథ్‌’పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌

అభ్యర్థులపై కేసులు ఎత్తివేయాలి.. అనర్హుల ప్రకటన ఉపసంహరించుకోవాలి 

గాంధీ ఆస్పత్రిలో క్షతగాత్రులకు పరామర్శ 

గాంధీ ఆస్పత్రి(హైదరాబాద్‌): అగ్నిపథ్‌ కారణంగా గత 48 గంటల్లో దేశవ్యాప్తంగా 24 మంది యువకులు మృతి చెందారని, యువతకు కాంగ్రెస్‌పార్టీ అండగా ఉంటుందని, ఆత్మహత్యలకు పాల్పడి తల్లిదండ్రులకు శోకాన్ని మిగల్చవద్దని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కోరారు. పార్లమెంటు సభ్యులమైన రాహుల్‌గాంధీ, తాను డిఫెన్స్‌ స్టాండింగ్‌ కమిటీలో చర్చిస్తామని, రానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రశ్నిస్తామని రేవంత్‌రెడ్డి అన్నారు.

ఆర్మీ అభ్యర్థులపై బనాయించిన కేసులను, అనర్హత ప్రకటనను ఉపసంహరించుకోవాలని, మృతి చెందిన రాకేశ్‌ కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, అగ్నిపథ్‌ను రద్దు చేసి సాధారణ పద్ధతిలోనే ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ జరపాలని డిమాండ్‌ చేశారు. అగ్నిపథ్‌పై ప్రధాని మోదీ అవగాహనలోపం, యువకుల భావోద్వేగమే హింసకు దారితీసిందన్నారు.

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఘటనలో గాయపడి గాంధీఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను శనివారంరాత్రి ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ క్షతగాత్రులకు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు, ఆర్మీ ఉద్యోగార్థులకు న్యాయ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ కాపాడేందుకు సీఎం కేసీఆర్‌ కంటే ప్రతిపక్షనేతగా తనకు ఎక్కువ బాధ్యత ఉందని పేర్కొన్నారు. సైన్యంలో చేరాలనుకునే యువతను నిరాశపరుస్తున్న అగ్నిపథ్‌ పథకాన్ని ఉపసంహరించుకోవాలని జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌ డిమాండ్‌ చేశారు. 

వెనుక గేటు నుంచి దర్జాగా..  
పద్మారావునగర్‌ వైపు ఉన్న గేటు నుంచి రేవంత్‌ గాంధీ ఆస్పత్రిలోకి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. గతంలో ప్రగతిభవన్‌ ముట్టడికి, ఇటీవల బాసర ట్రిపుల్‌ ఐటీల్లోకి వేర్వేరు మార్గాల ద్వారా చేరుకున్న రేవంత్‌రెడ్డి గాంధీ ఆస్పత్రిలోకి ఎలా ప్రవేశిస్తారోనని కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆసక్తికరంగా ఎదురుచూశారు. ఆస్పత్రి ప్రధాన గేటు వద్ద భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు, వాహనాలు, అంబులెన్స్‌లను కూడా తనిఖీ చేస్తున్న నేపథ్యంలో వెనుకగేటు నుంచి రేవంత్‌రెడ్డిని పోలీసులే సాదరంగా ఆహ్వానించడం గమనార్హం. గోపాలపురం ఏసీపీ సుధీర్, చిలకలగూడ సీఐ నరేశ్‌లు దగ్గరుండి రేవంత్‌ను క్షతగాత్రుల వద్దకు తీసుకువెళ్లడం విశేషం.

మరిన్ని వార్తలు