కలుగులోని ఎలుకలు బయటికొస్తున్నాయ్‌

9 May, 2022 01:07 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి. చిత్రంలో  ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ 

మేం ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ను రైతులు నమ్మారు 

అందుకనే టీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎంలు దాడికి దిగుతున్నాయి

ఈ మూడు పార్టీల మధ్య ఒప్పందం బయటపడింది

పీసీసీ చీఫ్‌ రేవంత్‌ వ్యాఖ్యలు

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన వరంగల్‌ డిక్లరేషన్‌పై రాష్ట్ర రైతాంగం సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించిందని, ఈ డిక్లరేషన్‌లో ప్రకటించిన తొమ్మిది ప్రధాన తీర్మానాలపై రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉత్సవాలు చేసుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు. వరంగల్‌ డిక్లరేషన్‌ సానుకూల ప్రభా వాన్ని చూపుతుండడంతో కలుగులో దాక్కున్న ఎలుకలు బయటకు వస్తున్నాయని, టీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎంలు మూకుమ్మడిగా కాంగ్రెస్‌ పార్టీపై దాడి చేస్తున్నాయని అన్నారు.

రాహుల్‌ పర్యటనతో ఆ మూడు పార్టీల మధ్య ఉన్న చీకటి ఒప్పందం బయటపడిందని చెప్పారు. దుష్ట రాజకీయ త్రయాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోందని వ్యాఖ్యానించారు. ఆదివారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రేవంత్‌ మాట్లాడారు. నల్లగొండ ఎంపీ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీఏసీ కన్వీనర్‌ షబ్బీర్‌ అలీ, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు మహేశ్‌కుమార్‌గౌడ్, గీతారెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్, ప్రచార కమిటీ కన్వీనర్‌ అజ్మతుల్లా హుస్సేన్, పార్టీ సీనియర్‌ నేత నాయిని రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు. 

కేటీఆర్‌కు ఆ అర్హత లేదు..
గాంధీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు లేదని రేవంత్‌ అన్నారు. ప్రధానమంత్రిగా పనిచేసే అవకాశం పలుమార్లు వచ్చినప్పటికీ ఆ పదవిని త్యాగం చేసిన ఘనత వారిదని చెప్పారు. ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను అమలు చేయని ఘనత టీఆర్‌ఎస్‌కు దక్కుతుందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో దళితుడిని సీఎంను చేస్తానని చెప్పిన టీఆర్‌ఎస్, ఆ పనిచేయకపోగా దళితుడైన భట్టి విక్రమార్క సీఎల్పీ నేతగా ఉండడంతో ఓర్వలేక కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌ పార్టీలోకి కొనుగోలు చేశారని ఆరోపించారు.

ఎవరూ అడగకపోయినా, పార్టీ పక్షాన హామీ ఇవ్వకపోయినా దళితులను సీఎంలుగా చేసిన చరిత్ర కాంగ్రెస్‌దని చెప్పారు. పారిపోయే చరిత్ర ఉన్నది కల్వకుంట్ల కుటుంబానికేనని, కేసీఆర్‌ సిద్దిపేట నుంచి కరీంనగర్‌ ఎంపీగా, ఆ తర్వాత మహబూబ్‌నగర్‌ ఎంపీగా, ఆ తర్వాత గజ్వేల్‌కు పారిపోయింది చరిత్ర కాదా అని ప్రశ్నించారు. 

కేసీఆర్‌ది చతురత..రాహుల్‌ టూరిస్టా?
రాజకీయ ప్రత్యామ్నాయం అంటూ కేసీఆర్‌ ఇతర రాష్ట్రాలకు వెళ్లి శరద్‌పవార్, స్టాలిన్, మమతా బెనర్జీలను కలిస్తే అది చతురత అవుతుంది.. అదే రాహుల్‌గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తే టూరిస్టు అవుతారా అని రేవంత్‌ ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ ఈ దేశానికి కాబోయే ప్రధాని అని వ్యాఖ్యానించారు. 

అమరుల స్థూపం, యాదాద్రిపై విచారణ
రూ.62 కోట్లతో ప్రారంభించిన అమరవీరుల స్థూపం నిర్మాణ అంచనాలను రూ.200 కోట్లకు పెంచారని, యాదాద్రి దేవస్థానం పేరుతో రూ.2 వేల కోట్లను దోచుకున్నారని పీసీసీ చీఫ్‌ ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక ఈ రెండింటిపై విచారణ జరిపించి దోషులను శిక్షిస్తామని చెప్పారు.100 రోజుల్లోనే అమరవీరుల స్థూపాన్ని అద్భుతంగా నిర్మిస్తామన్నారు. సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌ స్థాయి ఏంటో మొన్నటి ‘మా’ఎన్నికల్లోనే తేలిపోయిందని వ్యాఖ్యానించారు.

ఆ ముగ్గురిదీ ఒకే ఎజెండా: ఉత్తమ్‌
టీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎంలు ఒకే ఎజెండాతో ముందుకెళుతున్నాయనేందుకు రాహుల్‌ పర్యటనపై ఆయా పార్టీలు మాట్లాడిన మాటలే నిదర్శనమని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఎంఐఎం గురించి రాహుల్‌ ఒక్కమాట మాట్లాడకపోయినా అసదుద్దీన్‌ ఒవైసీ బీజేపీ ఏజెంట్‌గా విమర్శలు చేశారా అని ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో ఏకకాలంలో రుణమాఫీ చేయడమే కాకుండా, రూ.2500కు క్వింటాల్‌ ధాన్యాన్ని కొనుగోలు చేసిన ఘనత అక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనన్నారు. అసదుద్దీన్‌ తీరు చూస్తుంటే బీజేపీకి బ్రోకరిజం చేస్తున్నట్టు అనిపిస్తోందని షబ్బీర్‌ అలీ విమర్శించారు.  

మరిన్ని వార్తలు