డ్రగ్స్‌పై సిట్‌ ఏర్పాటు చేయాలి 

4 Apr, 2022 01:59 IST|Sakshi

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో డ్రగ్స్‌ వ్యవహారంపై నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. హైదరాబాద్‌లో వెలుగు చూసిన పబ్‌లో డ్రగ్స్‌ వినియోగం కేసులో ఎంతటి వారున్నా కఠినంగా శిక్షించాలని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ కోరారు.

ఆదివారం గాంధీభవన్‌లో మరో వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత కేసులో ఏసీపీకి మెమో ఇచ్చి సీఐని సస్పెండ్‌ చేస్తే సరిపోదన్నారు. నిజాయితీగా విచారించి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, గంజాయి, డ్రగ్స్‌ విచ్చలవిడిగా అమ్ముతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ వ్యవహారంపై ఒక డాక్టర్‌గా, గవర్నర్‌ తమిళిసై స్పందించాలని మహేశ్‌గౌడ్‌ కోరారు.  

అన్ని పబ్‌లు మూసివేయాలి 
నగరంలోని అన్ని పబ్‌లను మూసివేయాలని మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. తన కొడుకు పుట్టిన రోజు వేడుకలకు పబ్‌కు వెళ్లిన మాట వాస్తవమేనన్నారు. స్నేహితులతో కలిసి వెళ్తే అభాండాలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎదుగుతున్న తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. 

మరిన్ని వార్తలు