నానాటికీ పెరిగిపోతున్న ‘ట్రాఫిక్‌ కేసులు’.. కనిపించకుండానే చలాన్‌ పడిపోద్ది!

11 Jan, 2022 16:19 IST|Sakshi

‘ఆదాయం’ కోసం వాడుకుంటున్న పోలీసులు

చోదకుల్లో అవగాహన పెంపుతోనే తగ్గే అవకాశం 

ఆ కోణంలో చర్యలు తీసుకోని యంత్రాంగం  

సాక్షి, సిటీబ్యూరో: ట్రాఫిక్‌ ఉల్లంఘనలు నానాటికీ పెరిగిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాలు లక్షల్లో, మృతులు వేల సంఖ్యలో ఉండటానికీ ఇవే ప్రధాన కారణం. ఈ ఉల్లంఘనల్ని తగ్గించడానికి ప్రయత్నించాల్సిన యంత్రాంగాలు ఏటా పెరిగిపోతున్నా పట్టించుకోవట్లేదు. పైగా అదేదో ఘనతగా ఆర్భాటంగా ప్రకటిస్తున్నాయి. 2018లో 1.02 కోట్లుగా ఉన్న ట్రాఫిక్‌ వయెలేషన్స్‌ గత ఏడాది నాటికి 2.33 కోట్లకు చేరింది. పాశ్చాత్య దేశాల్లో మాదిరిగా ఇక్కడా వీటిని ఆదాయ వనరుగా చూడటంతోనే ఈ పరిస్థితి దాపురించిందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

తెలియకుండా తడిసిమోపెడు... 
ట్రాఫిక్‌ విభాగం అధికారులు నమోదు చేస్తున్న ఉల్లంఘనల కేసుల్లో అత్యధికం హెల్మెట్‌ కేసులే ఉంటున్నాయి. కొన్నాళ్ల క్రితం వరకు కేవలం వాహన చోదకుడు హెల్మెట్‌ ధరించకపోతేనే ఈ– చలాన్‌ జారీ చేసే వారు. ఇటీవల కాలంలో వాహనం వెనుక కూర్చున్న వ్యక్తి (పిలియన్‌ రైడర్‌) హెల్మెట్‌ ధరించకపోయినా చలాన్‌ జారీ చేస్తున్నారు. మరోపక్క వాహనచోదకులు హాఫ్‌ హెల్మెట్‌ ధరించినా జరిమానా తప్పట్లేదు. ఒకటి రెండుసార్లు అనుభవంలోకి వస్తే తప్ప ఈ విషయం వాహనచోదకులకు అర్థం కావట్లేదు. ఇలాంటి సున్నితాంశాలపై అవగాహన కల్పించాల్సిన పోలీసులు ఆ విషయం మర్చిపోతున్నారు. అదేమని ప్రశ్నిస్తే మోటారు వాహనాల చట్టంలో (ఎంవీ యాక్ట్‌) ఉన్న నిబంధనల్నే తాము అమలు చేస్తున్నామని తప్పించుకుంటున్నారు. ట్రాఫిక్‌ పోలీసుల లెక్కలో డ్రైవింగ్‌ చేసే ప్రతి వ్యక్తీ ఎంవీ యాక్ట్‌లో నిష్ణాతుడి కిందికే వస్తుండటం గమనార్హం.

కనిపించకుండా బాదేస్తున్నారు.. 
ఒకప్పుడు ట్రాఫిక్‌ పోలీసులు కేవలం కాంటాక్ట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నిర్వహించే వారు. దీని ప్రకారం రోడ్డు మీద ఉల్లంఘనుడిని ఆపి చలాన్లు జారీ చేసేవారు. ఇటీవల కాలంలో 95 శాతం నాన్‌ కాంటాక్ట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ జరుగుతోంది. రహదారులపై సంచరిస్తున్న ట్రాఫిక్‌ ఉల్లంఘనుల ఫొటోలను వివిధ మార్గాల్లో సేకరిస్తున్న పోలీసులు ఈ– చలాన్లు జారీ చేస్తున్నారు. దాదాపు ఎక్కడా కనిపించకుండా జరిమానా విధించేస్తున్నారు.

వాహన చోదకుల్లో అనేక మంది పోలీసులు కనిపించినప్పుడు మాత్రమే నిబంధనలు పాటిస్తుంటారు. నాన్‌ కాంటాక్ట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో వాళ్లు కనిపించే అవకాశం లేకపోవడంతో అడ్డంగా బుక్కవుతున్నారు. నగరంలో సంచరించే ద్విచక్ర వాహన చోదకుల్లో దాదాపు 90 శాతం మంది వద్ద హెల్మెట్లు ఉంటాయి. వీళ్లలో చాలా మంది వాటిని వాహనానికో, పెట్రోల్‌ ట్యాంక్‌ మీదో ఉంచుతారు. చౌరస్తాలకు సమీపంలోనో, ట్రాఫిక్‌ పోలీసులు ఉన్న చోటో మాత్రమే తీసి తలకు పెట్టుకుంటారు. ఇలాంటి నిర్లక్ష్యాలకు పాల్పడే వాళ్లూ నాన్‌ కాంటాక్ట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్లో బుక్కైపోతున్నారు.

రహదారి భద్రత, ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే వారికి జరిమానాలు విధించడమనే విదేశాల్లోనూ ఉంది. కొన్ని పాశ్చాత్య దేశాల్లో ఈ ఆదాయమే పోలీసులకు జీతంగా వస్తుంటుంది. ఆయా చోట్ల పోలీసు విభాగాలు ప్రభుత్వంలో భాగంగా కాకుండా, మున్సిపల్‌ కార్పొరేషన్లలో అంతర్భాగంగా పని చేస్తాయి. మేయర్‌ ఆధీనంలో ఉండే వీరికి జీతాలను ఆయా కార్పొరేషన్లే చెల్లిస్తుంటాయి. ఈ కారణంగానే ఆయా పోలీసు విభాగాలు ప్రతి నెలా కనీసం తమ జీతాలకు సరిపడా అయినా జరిమానాల రూపంలో వసూలు చేసి మున్సిపల్‌ కార్పొరేషన్ల ఖజానాకు చేర్చాల్సి ఉంటుంది. నగరంలో పరిస్థితులు అలా ఉండవు. పోలీసులు ప్రభుత్వంలో భాగంగా పని చేస్తుంటారు. వీరికి జీతాలు సర్కారు ఖజానా నుంచి వస్తాయి. అయినప్పటికీ ట్రాఫిక్‌ పోలీసులు మాత్రం జరిమానాలు విధించడానికి ఆసక్తి చూపుతుంటారు.  

తగ్గితేనే విజయం సాధించినట్లు 
ప్రతి ఏటా తాము గతేడాది కంటే ఇన్ని వేల, లక్షల చలాన్లు ఎక్కువగా విధించామంటూ పోలీసులే ప్రకటిస్తుంటారు. ప్రాక్టికల్‌గా చూస్తే ఏటా ఉల్లంఘనుల సంఖ్య తగ్గించడం ద్వారా ప్రమాదాలు నిరోధిస్తేనే పోలీసులు విజయం సాధించినట్లు. ఈ అంశంలో నిర్దిష్టమైన ప్రణాళిక కొరవడింది. అవగాహన పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ ఆర్భాటాలకు, ప్రచారానికే పరిమితం అవుతున్నాయి. ఒకటో తరగతి నుంచీ ట్రాఫిక్‌ పాఠాలు నేర్పాలనే ప్రతిపాదన ఏళ్లుగా పెండింగ్‌లో ఉండిపోయింది. ఇలాంటి చర్యల వల్లే ప్రతి ఒక్కరిలో అవగాహన పెరిగి, ఉల్లంఘనులు తగ్గుతారు.
– శ్రీనివాస్, మాజీ పోలీసు అధికారి 

మరిన్ని వార్తలు