బీసీ స్టడీ సర్కిళ్లలో బ్రాహ్మణ నిరుద్యోగులకు శిక్షణ

1 May, 2022 03:00 IST|Sakshi

గ్రూప్స్, పోలీస్‌ పోస్టుల భర్తీ నేపథ్యంలో నిర్ణయం 

రూ.5 లక్షల వార్షికాదాయంలోపు ఉన్నవారు అర్హులు 

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న బ్రాహ్మణ నిరుద్యోగులకు బీసీ స్టడీ సర్కిళ్లలో శిక్షణ ఇప్పించాలని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ నిర్ణయించింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖతో ఒప్పందం చేసుకుంది. గ్రూప్స్, పోలీస్‌ ఖాళీల భర్తీకి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిన నేపథ్యంలో ఆ ఉద్యోగాలు పొందాలనుకుంటున్న బ్రాహ్మణ నిరుద్యోగులు తమకు శిక్షణ కావాలని అభ్యర్థిస్తున్నారు. కానీ, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ ఆధ్వర్యం లో ఇలాంటి శిక్షణ కేంద్రాలు లేకపోవడం తో, బీసీ సంక్షేమ శాఖను సంప్రదించి ఆ మేరకు అంగీకారం తీసుకుంది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 బీసీ స్టడీ సర్కిళ్లతోపాటు కొత్తగా ప్రతిపాదించిన మరో ఐదు సర్కిళ్లలో బ్రాహ్మణ అభ్యర్థులకూ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ వివరాలను ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వివరాలు వారి మాటల్లో.. ‘వార్షికాదాయం రూ.5 లక్షలు, అంతకంటే లోపు ఉన్న కుటుంబాల నిరుద్యోగులు ఈ శిక్షణకు అర్హులు.  

ఆసక్తి గల అభ్యర్థులు మే 1 నుంచి మే 7వ తేదీలోపు www.brahmin parishad.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మే 16 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయి. ఒక్కో సెంటర్‌లో గరిష్టంగా 100 మంది అభ్యర్థులకు శిక్షణ ఇస్తారు. ఈ సంఖ్య పెరిగితే రెండో బ్యాచ్‌ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించనున్నారు. శిక్షణవేళ అభ్యర్థులకు స్టైపండ్‌ కూడా వస్తుంది. గ్రూప్‌–1  అభ్యర్థులకు రూ.5 వేలు, ఇతర పోస్టులకు రూ.2 వేలు చొప్పున చెల్లిస్తారు.

అభ్యర్థులు మీ సేవ ద్వారా పొందిన కుల ధ్రువీకరణ పత్రం, రూ.5 లక్షలు, అంత కంటే లోపు ఉందని తెలిపే ఆదాయ ధ్రువపత్రం, 1 నుంచి 7వ తరగతిలకు చెందిన బోనఫైడ్‌ సర్టిఫికెట్, విద్యార్హత పత్రాలు, ఆధార్‌ ప్రతి, పాస్‌పోర్టు సైజ్‌ ఫొటో, బ్యాం కు పాసు పుస్తకం ప్రతిని జత చేయాల్సి ఉంటుంది. ఏవైనా పత్రాలు అందుబాటులో లేకుంటే, తరగతులు ప్రారంభమయ్యేలోపు సమర్పిస్తామని సెల్ఫ్‌ డిక్లరేషన్‌ అందించాలి. బీసీ స్టడీ సర్కిళ్లలో ఓబీసీలకు 5 శాతం సీట్లు ఉండే వెసులుబాటు ఆధారంగా ఈ శిక్షణకు ఏర్పాట్లు చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు