ఇక్కడ.. లెక్కే లేదు..!

30 Jul, 2022 02:44 IST|Sakshi
ఆరునెలల క్రితమే సిద్ధమైన  నూతన ట్రెజరీ కార్యాలయం 

సొంత భవనాలు సిద్ధమైనా, అద్దె భవనాలపైనే మోజు 

కోట్లు పోసి కొన్నా.. మొరాయిస్తున్న కంప్యూటర్లు 

బయటి బిల్లుకు ఐదు రోజులు.. సొంత ఉద్యోగులకు నెలలైనా దిక్కుండదు  

ట్రెజరీస్‌ అండ్‌ అకౌంట్స్‌ విభాగంలో అధికారుల ఇష్టారాజ్యం 

సాక్షి, నెట్‌వర్క్‌:  ప్రతి పనికి, ప్రతి ఆదేశానికి ఇక్కడ ఓ లెక్క, పద్ధతి ఉండాలి. కానీ అర దశబ్దానికి పైగా ఒకే పోస్టులో పాతుకుపోయిన కొందరు ఉన్నతాధికారుల కారణంగా రాష్ట్ర ట్రెజరీస్‌ అండ్‌ అకౌంట్స్‌ విభాగంలో ఎలాంటి లెక్క, పద్ధతి లేకుండా పోయిందని చెపుతున్నారు. సిబ్బంది విన్నపాలు, విజ్ఞాపనలు కనీస పరిశీలన లేకుండానే బుట్టదాఖలవుతున్న తీరు ఉన్నత స్థాయి అధికారుల ఇష్టారాజ్యానికి అద్దం పడుతోందని ఆరోపణలు వస్తున్నాయి.

రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా అద్దె భవనాల్లో ఉన్న పలు సబ్‌ట్రెజరీ కార్యాలయాల్లో నీరు కురుస్తోంది. అలాంటి వాటిని వదిలి సొంత భవనాల్లోకి వెళ్లాలన్న విజ్ఞప్తులను పట్టించుకునేవారు కరువయ్యారని అంటున్నారు. అలాగే పదోన్నతులు, బదిలీలు, డిప్యుటేషన్లు, వేధింపులు, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ ఫైళ్ల పరిష్కారంలో జాప్యంపై ట్రెజరీస్‌ అండ్‌ అకౌంట్స్‌ ఉద్యోగుల్లో తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది.  

సొంతభవనాలు సిద్ధమైనా.. అద్దె ఆఫీసుల్లోనే 
రాష్ట్రంలో పలు చోట్ల సొంతంగా నిర్మించిన కొత్త సబ్‌ట్రెజరీ భవనాలు సిద్ధమైనా.. ప్రైవేటు భవనాలపై ఆ శాఖ ఉన్నతాధికారులకు మోజు తీరటం లేదని విమర్శలు వస్తున్నాయి. ఓ వైపు సౌకర్యాల లేమితో పాటు పలు భవనాలు వర్షాలకు నీరు కురుస్తూ, పెచ్చులూడుతూ ఉద్యోగులను భయపెడుతున్నా ఉన్నతాధికారులు వాటిని వీడటం లేదని ఆరోపణలున్నాయి. సొంత భవనాల్లోకి మారకపోవడం ఉద్యోగులకు ఇబ్బందికరంగా మారింది.

రాష్ట్రవ్యాప్తంగా సబ్‌ట్రెజరీ భవనాల ఆధునీకరణ కోసం నాలుగేళ్ల క్రితం రూ.23.8 కోట్లను పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌కు బదిలీ చేశారు. అయితే ప్రభుత్వం ఉన్న భవనాల ఆధునీకరణ (రీ మోడలింగ్‌) కోసమే నిధులిస్తే.. అన్నీ తానై వ్యవహరిస్తున్న డైరెక్టరేట్‌ అధికారి కనుసన్నల్లో పలు చోట్ల నూతన భవనాలనే కట్టించేశారు. అయితే నూతన భవనాలు పూర్తయి ఆరునెలలు అవుతున్నా.. ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్మించారన్న కారణంతో వాటిని ట్రెజరీ డైరెక్టరేట్‌ తిరిగి స్వాధీనం చేసుకోకపోవటంతో ఆయా చోట్ల ఉద్యోగులు అవస్థలు పడాల్సి వస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఆరునెలల క్రితమే మిర్యాలగూడ, హుజూర్‌నగర్, చండూరు, నిడ్మనూరు, కోదాడ, నకిరేకల్, నాంపల్లిలలో నూతన భవనాలు సిద్ధం కాగా, అలంపూర్‌లో నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ఇక రామాయంపేట, తూప్రాన్, భద్రాచలం తదితర చోట్ల టెండరు స్థాయిలోనే పనులు నిలిపేశారు. 

విన్నపాలు వినరు..  
‘ట్రెజరీ కార్యాలయానికి వచ్చే బిల్లులను నిబంధన మేరకు ఐదు రోజుల్లో ఆమోదించాలి.. లేదా తిరస్కరించాలి. లేదంటే మాకు మెమో తప్పదు. కానీ మేము ట్రెజరీస్‌ డైరెక్టరేట్‌కు చేసే విన్నపాలకు మాత్రం దిక్కులేదు. పరిష్కారానికి ఎన్ని నెలలైనా పట్టొచ్చు’అని ఉద్యోగులు అంటున్నారు. సమస్య తీవ్రతను చెప్పేందుకు డైరెక్టర్‌ను కలవడానికి వెళితే ఎవరికీ అనుమతి ఉండదంటూ రాష్ట్ర ట్రెజరీస్‌ అండ్‌ అకౌంట్స్‌ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు.

తీవ్ర అనారోగ్యానికి గురై, కోలుకునేందుకు రూ.50 లక్షల ఆస్పత్రి బిల్లు చెల్లించిన ఒక ట్రెజరీ ఉ ద్యోగికి చెందిన మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ ఫైల్‌ ను డైరెక్టరేట్‌లో 3 నెలలు తొక్కిపెట్టిన వైనం.. డైరెక్టరేట్‌లో ఉద్యోగుల దుస్థితికి నిదర్శనమని సబ్‌ట్రెజరీ స్థాయి అధికారి ఒకరు ‘సాక్షి’వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యుటేషన్లు, పదోన్నతుల విషయ ంలో సీనియర్‌ ఐఏఎస్‌ పూర్తి మద్దతు తమకుందన్న ధీమాతో ఏకంగా ఆర్థిక మంత్రి సూచనలను సైతం డైరెక్టరేట్‌ ఉన్నతాధికారులు పట్టించుకోవటం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

కోట్లు పోసి కొన్నా.. తప్పని మొరాయింపు  
ట్రెజరీ కార్యాలయాలకోసం ఇటీవల రూ.6 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన కంప్యూటర్లు ఉద్యోగులకు చుక్కలు చూపెడుతున్నాయి. సిస్టమ్‌ ఆన్‌చేసిన అనంతరం బూట్‌ అయ్యేందుకే ఐదు నుంచి పది నిమిషాల సమయం పడుతోందని చెబుతున్నా రు. మధ్య, మధ్యలో సాఫ్ట్‌వేర్‌ సపోర్ట్‌ చేయక షట్‌డౌన్‌ అవుతుండటంతో సమయమంతా వృథా అవు తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా కొన్న వాటికంటే ఆరేళ్ల క్రితంనాటి కంప్యూటర్లే మెరుగ్గా పనిచేస్తున్నాయని చెపుతున్నారు. 

ఆఫీసుకు వెళ్లాలంటే భయం..  
ఆఫీసుకు వెళ్లాలంటేనే భయం వేస్తోంది. పూర్తి శిథిలావస్థకు చేరిన అద్దె భవనంలో ఇప్పుడు విధు­లు నిర్వహిస్తున్నాం. భవ­నం స్లాబ్‌ పెచ్చులూడిపడుతోంది. వర్షం నీళ్లు వచ్చి అనేక ఫైళ్లు తడిచిపోతున్నాయి. కొత్త భవనం సిద్ధమైనా ఇంకా ప్రారంభించటం లేదు.     
– ఎం.సతీశ్, సీనియర్‌ అకౌంటెంట్, చండూరు, నల్లగొండ జిల్లా  

మరిన్ని వార్తలు