సెప్టెంబర్‌ 17.. మూడు పార్టీల మధ్య ట్రయాంగిల్‌ గేమ్‌

4 Sep, 2022 03:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజకీయాలను సెప్టెంబర్‌ 17.. ఒక్క సారిగా మార్చేసింది. వాడీవేడిని రగిల్చింది. ఎత్తుకు పైఎత్తులు వేసేలా శనివారం రాజకీయాలు కొనసాగాయి. మూడు పార్టీల మధ్య గేమ్‌గా మారింది. తెలంగాణ విలీన దినాన్ని ఎనిమిదేళ్లుగా పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ఉత్సవాల నిర్వహణకు పోటాపోటీగా రంగంలోకి దిగాయి. పరేడ్‌ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభు త్వం నిర్వహిస్తుందని, అందులో పాల్గొనాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు కర్ణాటక సీఎం బస్వరాజ్‌ బొమ్మై, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండేలకు లేఖలు రాశారు.

హైదరాబాద్‌ సంస్థానం నుంచి విముక్తి పొందిన మూడు రాష్ట్రాలను కలిపి విమోచన దినోత్సవం హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హాజరై కేంద్రబలగాల గౌరవ వందనం స్వీకరిస్తారని అందులో వెల్లడించారు. గౌరవ అతిథులుగా హాజరుకావాలని ముగ్గురు ముఖ్యమంత్రులను కోరారు. మరోౖ వెపు, సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం’గా సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహించాలని తీర్మానించారు. ప్రారంభ, ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు.

తెలంగాణ ప్రాశస్త్యాన్ని చాటిచెప్పేలా కార్యక్రమాలను నిర్వహించాలని కేబినెట్‌ అధికారులను ఆదేశించింది. ఇదిలాఉండగా, మజ్లిస్‌ పార్టీ సైతం ఉత్సవాలను ఆహ్వానిస్తూనే.. జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించాలంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు, సీఎం కేసీఆర్‌కు ఆ పార్టీ చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ లేఖ రాశారు. పాతబస్తీలో తిరంగా యాత్రతోపాటు బహిరంగ సభ నిర్వహిస్తామని, కేసీఆర్‌ను కూడా ఆహ్వానిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన అసదుద్దీన్‌.. తమ సూచనను పరిగణనలోకి తీసుకుని జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహణకు ముందుకొచ్చినందుకు కేసీఆర్‌కు, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు అంటూ ట్వీట్‌ చేయడం కొసమెరుపు. కాగా ఈ ఉత్సవాల గురించి ఎనిమిదేళ్లుగా ఏ మాత్రం పట్టించుకోని బీజేపీ, టీఆర్‌ఎస్‌ ఇప్పుడు నిర్వహిస్తామని చెప్పడం అవకాశవాద రాజకీయమంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించడం గమనార్హం. 


 

మరిన్ని వార్తలు