కేఏ పాల్‌పై టీఆర్‌ఎస్‌ కార్యకర్త దాడి 

3 May, 2022 03:29 IST|Sakshi
కేఏ పాల్‌పై దాడి చేస్తున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్త. ఇన్‌సెట్‌లో దాడి చేసిన అనిల్‌ కుమార్‌  

పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు సిరిసిల్ల వెళ్తుండగా ఘటన 

సిద్దిపేట రూరల్, సిద్దిపేట కమాన్‌/తంగళ్లపల్లి (సిరిసిల్ల): ప్రజాశాంతి పార్టీ జాతీయ అధ్యక్షుడు కేఏ పాల్‌పై దాడి జరిగింది. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వెళ్తుండగా ఓ టీఆర్‌ఎస్‌ కార్యకర్త దాడి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని బస్వాపూర్‌ గ్రామ రైతులను పరామర్శించేందుకు సోమవారం హైదరాబాద్‌ నుంచి పాల్‌ బయలుదేరారు. విషయం తెలుసుకున్న టీఆర్‌ఎస్‌ నాయకులు పెద్ద ఎత్తున సిరిసిల్ల సరిహద్దుకు చేరుకున్నారు.

శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని భావించిన పోలీసులు సిద్దిపేట జిల్లా సరిహద్దు గ్రామం జక్కాపూర్‌లో పికెట్‌ ఏర్పాటు చేసి పాల్‌ను అడ్డుకున్నారు. అదే సమయంలో అక్కడికి టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. మీడియాతో పాల్‌ మాట్లాడుతుండగా జిల్లెల్ల గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త అనిల్‌కుమార్‌ దాడి చేశాడు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

జక్కాపూర్‌ రోడ్డుపై పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ సమస్య ఎదురైంది. పోలీసులు బందోబస్తు మధ్య పాల్‌ను వెనక్కి పంపారు. సిద్దిపేట పట్టణంలో పాల్‌ మాట్లాడుతూ.. పోలీసులు టీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని మండిపడ్డారు. రైతు కుటుంబాలను పరామర్శిస్తే తప్పేంటని నిలదీశారు. తనపై దాడి చేసిన వారిని అరెస్టు చేసి శిక్షించాలన్నారు. ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. పాల్‌పై దాడిని ఖండిస్తూ బస్వాపూర్‌ గ్రామస్తులు నిరసన తెలిపారు.

మరిన్ని వార్తలు