లక్షలాది మందిని చేర్చుకోవడం లక్ష్యంగా.. 

15 May, 2022 01:28 IST|Sakshi

సంస్థాగత శిక్షణకు టీఆర్‌ఎస్‌ సన్నాహాలు 

జిల్లాల వారీగా శిక్షణకు సమన్వయకర్తలు 

రాష్ట్రస్థాయిలోనూ శిక్షణకు ప్రత్యేక కమిటీ 

మాస్టర్‌ ట్రెయినర్ల ఎంపికపై పార్టీ అధినేత కేసీఆర్‌ దృష్టి 

జూన్‌ లేదా జూలైలో ప్రారంభించే అవకాశం 

సాక్షి, హైదరాబాద్‌: రెండేళ్లుగా కరోనాతోపాటు వివిధ కారణాలతో వాయిదాపడుతూ వస్తున్న సంస్థాగత శిక్షణ కార్యక్రమాలపై టీఆర్‌ఎస్‌ దృష్టిసారించింది. జూన్‌ లేదా జూలైలో ప్రారంభించి అక్టోబర్‌లోగా పూర్తి చేయాలనే యోచనలో ఉంది. లక్షలాది మంది కార్యకర్తలను చేర్చుకోవడం లక్ష్యంగా చేపడుతున్న శిక్షణ కార్యక్రమాన్ని క్రమపద్ధతిలో చేపట్టాలని భావిస్తోంది.

పార్టీ కొత్త జిల్లా కార్యాలయాలు వేదికగా జరిగే శిక్షణ కార్యక్రమాల నిర్వహణ, సమన్వయ బాధ్యతలు చూసేందుకు జిల్లాకు ఇద్దరు చొప్పున చురుకైన నేతలను గుర్తించాలని ఆదేశించింది. వనపర్తి వంటి ఒకటి రెండు జిల్లాల్లో ఇప్పటికే సమన్వయకర్తల నియామకం పూర్తికాగా, మిగతా జిల్లాల్లో నెలాఖరులోగా నియమించేందుకు పార్టీ జిల్లా అధ్యక్షులు కసరత్తు చేస్తున్నారు.

ఇది పూర్తయిన వెంటనే సమన్వయకర్తల జాబితాలను పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పంపాలని సూచించారు. 65 లక్షల మంది సభ్యత్వం కలిగి ఉన్న టీఆర్‌ఎస్‌లో కనీసం 40 లక్షల మందిని లక్ష్యంగా చేసుకుని శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ ఉంటుందని తెలంగాణ భవన్‌ వర్గాలు వెల్లడించాయి. ఇదిలాఉంటే.. రాష్ట్రస్థాయిలో శిక్షణ కార్యకలాపాల షెడ్యూల్, సమన్వయం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో చురుకైన వక్తలుగా భావజాల వ్యాప్తికి కృషి చేసిన వారితోపాటు పార్టీ ప్రస్థానం, ప్రభుత్వ కార్యక్రమాలపై సంపూర్ణ అవగాహన కలిగిన వారిని ‘రిసోర్స్‌ పర్సన్లు’గా ఎంపిక చేసే పనిని కేసీఆర్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్, వరంగల్‌ మినహా మిగతా అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయ భవనాల నిర్మాణం పూర్తయింది. ఇప్పటికే వరంగల్, సిద్దిపేట తదితర చోట్ల జిల్లా కార్యాలయాలు ప్రారంభం కాగా, మిగతా జిల్లాల్లోనూ త్వరలో ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 

శిక్షణ అంశాలు, మెటీరియల్‌పై కసరత్తు 
కార్యకర్తలకు ఏయే అంశాలపై శిక్షణ ఇవ్వాలి, అందుకు అవసరమైన మెటీరియల్‌ తదితరాలపై కేసీఆర్‌ నిర్దిష్ట సూచనలు చేశారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం, ప్రత్యేక రాష్ట్ర సాధనలో టీఆర్‌ఎస్‌ పాత్ర, అధికారంలో ఉన్న రెండు పర్యాయాల్లో రంగాల వారీగా సాధించిన అభివృద్ధి వంటి అంశాలు శిక్షణలో అంతర్భాగంగా ఉంటాయి. వీటితోపాటు రాజ్యాంగం మౌలిక అంశాలు, జాతీయ రాజకీయాలు, స్వాతంత్య్రానంతరం పాలనలో జాతీయ పార్టీలు విఫలమైన తీరు, జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండా వంటి అనేక అంశాలు అందరికీ సులభంగా అర్థమయ్యేరీతిలో వివరించేలా పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్లు, వీడియోలు, షార్ట్‌ఫిల్మ్‌లు తదితర వాటికి రూపకల్పన చేస్తున్నారు.

కాలేజీ విద్యార్థులు, యువతను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో పార్టీ అధినేత ఉన్నట్లు సమాచారం. సామాజిక మాధ్యమాల్లో వచ్చే విమర్శలు, ఆరోపణలు, వాటిని తిప్పికొట్టాల్సిన తీరు తదితరాలు కూడా శిక్షణలో భాగంగా ఉంటాయని తెలుస్తోంది. శిక్షణ షెడ్యూల్, ఇతర వివరాలను త్వరలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ వెల్లడించే అవకాశముంది.   

మరిన్ని వార్తలు