ధాన్యంపై నేటి నుంచి టీఆర్‌ఎస్‌ నిరసన 

4 Apr, 2022 01:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రైతులు యాసంగిలో పండించిన మొత్తం వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో టీఆర్‌ఎస్‌ సోమవారం నుంచి నిరసన చేపట్టనుంది. పార్టీ పిలుపు మేరకు సోమవారం అన్ని మండల కేంద్రాల్లో జరిగే ధర్నాలో రైతులు, ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొనేలా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సన్నాహాలు పూర్తి చేశారు.

పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇచ్చిన ఆదేశాల మేరకు ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేసేలా ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లాల వారీగా సంబంధిత జిల్లా మంత్రులు ఆదివారం పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లా పరిషత్‌ చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలు వివిధ విభాగాల జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు మండల కేంద్రాల్లో జరిగే ధర్నాల్లో పాల్గొనాలని సూచించారు.

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేందుకు ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈనెల 6న జాతీయ రహదారులపై రాస్తారోకో, 7న జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు, 8న గ్రామాల్లో నిరసన ప్రదర్శనలు, రైతుల ఇళ్లపై నల్లజెండాలు ఎగరవేయడం, 11న ఢిల్లీలో నిరసన దీక్ష చేపట్టనున్నట్లు వివరించారు.    

మరిన్ని వార్తలు