బియ్యం కొనకపోతే.. నూకలు చెల్లు

5 Apr, 2022 02:18 IST|Sakshi
సిద్దిపేట లోని ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు

బీజేపీకి టీఆర్‌ఎస్‌ హెచ్చరిక.. మండల కేంద్రాల్లో దీక్షలు 

రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాల్లో టీఆర్‌ఎస్‌ దీక్షలు 

పాల్గొన్న మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, నేతలు 

యాసంగి ధాన్యం కొనుగోలుపై కేంద్రం తీరుకు నిరసన

పాల్గొన్న మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, నేతలు 

సాక్షి, హైదరాబాద్‌/ నెట్‌వర్క్‌: యాసంగిలో తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయకపోతే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి నూకలు చెల్లడం ఖాయమని టీఆర్‌ఎస్‌ హెచ్చరించింది. తెలంగాణపై ప్రేమ ఉంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్‌ చేసింది.

తెలంగాణలో పండే వరి ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో పాటు, నూకలు తినాలంటూ కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు జరిగాయి. పలుచోట్ల కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేశారు.

మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్‌ చైర్మన్లతో పాటు ముఖ్య నేతలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పచ్చబడుతున్న తెలంగాణపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. ధాన్యం కొనే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. కేంద్రం దిగొచ్చే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. 

నేతృత్వం వహించిన మంత్రులు 
మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేట, ఖిల్లాఘనపురం మండల కేంద్రాల్లో జరిగిన ధర్నాలో వ్యవసాయ శాఖ మంత్రి ఎస్‌.నిరంజన్‌రెడ్డి పాల్గొనగా, హన్వాడలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హాజరయ్యారు. కరీంనగర్‌లో పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, నిజామాబాద్‌ జిల్లా వేల్పూరులో రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు.

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మంచుకొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో జరిగిన నిరసనల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో జరిగిన దీక్షలో మంత్రి సబితారెడ్డి పాల్గొన్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీశ్‌రెడ్డి తాము ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. అన్ని మండల కేంద్రాల్లో జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ప్రణాళికబద్ధ అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన బీజేపీ వందేళ్ల అబద్ధాలను ఎనిమిదేళ్లలోనే ప్రజలకు చెప్పిందని విమర్శించారు. మండల కేంద్రాల్లో జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న నేతలందరూ.. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలతో పాటు, వరి సాగు చేయాలంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలను దీక్షల్లో పాల్గొన్న వారికి వినిపించారు. చాలాచోట్ల ప్రత్యేకంగా తెరలు ఏర్పాటు చేసి వరి ధాన్యం కొనుగోలు, యాసంగిలో వరి సాగు విషయంలో బీజేపీ నేతలు వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యల వీడియోలను ప్రదర్శించారు. దీక్షల అనంతరం తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించారు.  

రేపు నాలుగు హైవేలపై రాస్తారోకో 
వరిపోరు కార్యాచరణలో భాగంగా మంగళవారం విరామం తర్వాత బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ప్రధాన జాతీయ రహదారులను దిగ్బంధం చేయాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. కాగా ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలో జాతీయ రహదారులు లేనందున బుధవారం నిరసన కార్యక్రమాలు చేపట్టడం లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రకటించారు.   

మరిన్ని వార్తలు