Telangana: మరో నాలుగు నోటిఫికేషన్లు.. 806 కొలువులు

1 Jan, 2023 07:35 IST|Sakshi

ఏడాది చివరిరోజున టీఎస్‌పీఎస్సీ ప్రకటనలు 

లెక్చరర్స్, ఏఎంవీఐ, లైబ్రేరియన్, అకౌంటెంట్ల పోస్టుల భర్తీ 

అన్నింటికీ జనవరిలోనే దరఖాస్తుల స్వీకరణ 

ఏఎంవీఐ పోస్టులకు ఏప్రిల్‌ 23న పరీక్ష 

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్ల విడుదల కొనసాగుతూనే ఉంది. ఏడాది చివరిరోజైన శనివారం రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) నాలుగు నోటిఫికేషన్లు ఇచ్చింది. కళాశాల విద్య కమిషనరేట్‌ పరిధిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌ (లెక్చరర్లు), ఫిజికల్‌ డైరెక్టర్, లైబ్రేరియన్‌లతోపాటు ఇంటర్‌ విద్య విభాగంలో లైబ్రేరియన్‌ పోస్టులు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ పరిధిలో అకౌంట్స్‌ ఆఫీసర్, జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్, సీనియర్‌ అకౌంటెంట్‌ పోస్టులకు, రవాణాశాఖ పరిధిలో అసిస్టెంట్‌ మోటర్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కొలువులకు వేర్వేరు ప్రకటనలు జారీ చేసింది.

ఇందులో అన్నిపోస్టులకు దరఖాస్తుల స్వీకరణ మొదలయ్యే తేదీలను కమిషన్‌ ప్రకటించింది. ఏఎంవీఐ పోస్టులకు ఏప్రిల్‌ 23న పరీక్ష ఉంటుందని.. మిగతావాటికి త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు కమిషన్‌ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది. 

రవాణాశాఖలో 113 ఏఎంవీఐ పోస్టులకు.. 
రాష్ట్ర రవాణాశాఖ పరిధిలో 113 అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో మలీ్టజోన్‌–1 పరిధిలో 54, మల్టీజోన్‌–2 పరిధిలో 59 పోస్టులు ఉన్నాయి.  ఈ నెల 12వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్‌ 23న రాత పరీక్ష ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. వాస్తవానికి ఈ పోస్టులకు ఇదివరకే ప్రకటన జారీ చేసినా అభ్యర్థుల అర్హతల్లో మార్పులు చేయడంతో రద్దు చేశారు. తాజాగా మరో నోటిఫికేషన్‌ జారీ చేశారు.

చదవండి: ఇదేమైనా బాహుబలి సినిమానా?

మరిన్ని వార్తలు