పేపర్‌ లీకేజీ ఎఫెక్ట్‌: తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఎగ్జామ్‌ రద్దు.. ఇంకా అవి కూడా! మళ్లీ పరీక్ష ఎప్పుడంటే..

17 Mar, 2023 14:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటించింది టీఎస్‌పీఎస్‌సీ. అలాగే ఏఈఈ,  డీఏవో పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. 

శుక్రవారం ఉదయం జరిగిన కమిషన్‌ ప్రత్యేక సమావేశంలో.. పేపర్‌ లీకేజీ వ్యవహారంలో దర్యాప్తు చేపట్టిన సిట్‌ సమర్పించిన నివేదికను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. గత ఏడాది అక్టోబర్‌ 16వ తేదీన గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష జరగ్గా, ఈ ఏడాది జనవరి 22వ తేదీన ఏఈఈ, ఫిబ్రవరి 26వ తేదీన డీఏవో పరీక్షలు జరిగాయి. ఇక రద్దు చేసిన గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్షను జూన్‌ 11న నిర్వహించాలని కమిషన్‌ నిర్ణయించింది.

ఇదిలా ఉంటే.. మరోవైపు జూనియర్‌ లెక్చరర్స్‌ పరీక్షలతో పాటు మరికొన్ని ఎగ్జామ్స్‌ను సైతం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది టీఎస్‌పీఎస్‌సీ. ఇక రద్దు చేసిన పరీక్షలను మళ్లీ నిర్వహించాలని, వీలైనంత త్వరలో వాటి పరీక్షా తేదీలను ప్రకటిస్తామని టీఎస్‌పీఎస్‌సీ వెల్లడించింది. అయితే.. కమిషన్‌ తాజా నిర్ణయంపై గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

గత ఏడాది అక్టోబర్‌ 16వ తేదీన గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష జరగ్గా, ఆ ఫలితాలను జ‌న‌వ‌రి 13వ తేదీ (శుక్ర‌వారం) విడుద‌ల చేసింది టీఎస్‌పీఎస్‌సీ. 503 గ్రూప్‌-1 పోస్టులకు మొత్తం 3,80,081 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2,85,916 మంది పరీక్షకు హాజరయ్యారు. టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌కు సంబంధించి మొత్తం 25,050 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. జూన్‌లో మెయిన్స్‌ పరీక్ష నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ తొలుత భావించింది. ఈలోపే లీకేజీ వ్యవహారం ప్రకంపనలు రేపడంతో.. ఇప్పుడు అదే జూన్‌లో మళ్లీ రీఎగ్జామ్‌ నిర్వహించాలని నిర్ణయించింది. 

   

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు